”పిల్లలు తప్పు చేస్తే మందలించొచ్చు, కానీ వాళ్లు ఓటమి చెందినప్పుడు వారి వెంట నిలబడాలి. వాళ్ళని నిలబెట్టాలి”
ఇప్పుడు చలపతి చేస్తున్నది అదే! తన కొడుకు అవినాష్ మార్చ్‌లో రాసిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పాడు. అవినాష్ తెలివైన వాడు! పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అలాంటి వాడు పరీక్షల్లో తప్పడం చలపతికి ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించింది.
కొడుకును సున్నితంగా మందలించాడు చలపతి. మే నెలలో జరిగే సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశించాడు. సప్లమెంటరీలో రాసిన మూడు పరీక్షల్లో రెండు పాసయ్యాడు. ఓ పరీక్షలో మళ్లీ తప్పాడు.
అవినాష్ ఎప్పుడూ చాలాకీగా ఉండేవాడు. స్నేహితులందరితో సరదాగా ఉంటాడు. కానీ ఆ స్నేహితులెవరూ ఇప్పుడు అతనితో లేరు. అందరూ ఇంటర్మీడియట్ పాసయ్యారు. కొందరు డిగ్రీలో, మరి కొందరు బీటెక్‌లో చేరారు. ఫెయిల్ అయ్యానన్న బాధ కన్నా తను ఒంటరిగా మిగిలిపోయానన్న బాధే అతన్ని ఎక్కువ కృంగదీస్తోంది. తన స్నేహితులందరూ పై చదువులకు వెళ్లిపోయారు. కానీ తను మాత్రం అక్కడే ఆగిపోయాడు. క్రమంగా అవినాష్‌లో నిరాశ, నిస్ఫృహ పెరిగిపోయాయి. బయట తిరగడం మానేశాడు. ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లో కూడా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు.
గాలి మారితే ఆలోచనలు మారుతాయని అంటారు పెద్దలు. అందుకే అవినాష్ ను కొంతకాలం పట్నంలో ఉన్న చెల్లెలు సుభద్ర ఇంట్లో ఉంచాలని నిర్ణయించుకున్నాడు చలపతి. సుభద్ర కాస్తో కూస్తో చదువుకుంది. లోకజ్ఞానం గలది. సుభద్ర కొడుకు ఒక పేరు మోసిన కాలేజీలో ఇంజనీరింగ్ సీటు తెచ్చుకోవడంలో సుభద్ర ప్రోత్సాహం కూడా ఉంది. అవినాష్‌కు కూడా తన మేనత్త సుభద్ర అంటే ఎంతో ఇష్టం. ఆమె మాటపై ఎంతో గురి.
చాలాకాలం తర్వాత అన్నయ్య, మేనల్లుడు తన ఇంటికి రావడంతో సుభద్ర ఎంతో సంతోషపడింది. వారికి ఫలహారాలు చేసి పెట్టింది. అవినాష్‌లో ముందున్నంత చలాకితనం కనబడలేదు సుభద్రకు. చలపతి సుభద్రకు జరిగిందంతా చెప్పాడు. అవినాష్‌ను అక్కడే వదిలిపెట్టి సాయంత్రం బస్సుకు ఊరెళ్ళిపోయాడు.
అవినాష్‌తో లాలనగా మాట్లాడింది సుభద్ర. అతడు ఫెయిలవడానికి గల కారణాలను ఆరాదీసింది. అతడు చెప్పిందంతా జాగ్రత్తగా విని ఒక అంచనాకు వచ్చింది.
”చూడు అవినాష్! నువ్వు ఇంటర్మీడియట్ రెండేళ్ల పాటు కాలేజీకి సరిగా వెళ్లలేదు. చదువుపై దృష్టి పెట్టలేదు. పదవ తరగతిలో తెచ్చుకున్న మంచి మార్కులు చూసి అతివిశ్వాసానికి లోనయ్యావు. ఇంటర్ ఎలాగైనా గట్టెక్కగలనని అనుకున్నావు. స్నేహితులతో మాట్లాడడం, గ్రౌండ్లో క్రికెట్ ఆడటం, వాళ్లతో తిరగడం, ఇంటికొచ్చాక టీవీ, మొబైల్ ఫోన్‌తో కాలక్షేపం చేయడం. ఇట్టే తెలియకుండానే రెండేళ్లు గడిచిపోయాయి. పరీక్షలు దగ్గరపడ్డాయి. చదవాల్సిన సిలబ్ పెరిగిపోవడం, పాఠాలు అర్థం కాకపోవడంతో నువ్వు సిలబస్ పూర్తి చేయలేక పోయావు. అందుకే ఫెయిలయ్యావు. ఒక సంవత్సర కాలం వెనకబడ్డావు” అంటూ కొద్దిసేపు ఆగింది.
సుభద్ర చెప్పిందంతా నిజమే అన్నట్టు తల ఆడించాడు అవినాష్.
”ఆటల్లో ఓడిపోవడం, పరీక్షల్లో ఫెయిలవడం, ఇవేవీ తప్పు కాదు. కానీ ఓటమి చెందిన చోటే ఆగిపోవడం తప్పు. పడ్డ చోటు నుండి లేవాలి. జీవితం అంటే గెలుపోటముల మిశ్రమం. ఓటమికి గల కారణాలను విశ్లేషించాలి. తిరిగి గెలవడానికి ప్రయత్నించాలి. పై చదువులు చదవలేక పోతున్నానని, ఒక సంవత్సర కాలం వృధా అవుతోందని నువ్వు బాధపడుతున్నావు. కానీ నువ్వు అనుకుంటే, ఈ సంవత్సర కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, భవిష్యత్తుని మంచిగా నిర్మించుకోగలుగుతావు” అవినాష్ కు ధైర్యాన్ని నూరి పోసే పనిలో పడింది సుభద్ర.
”నువ్వు మహాభారతం వినే ఉంటావు. రాచ మర్యాదలతో అధికారాన్ని అనుభవించిన పాండవులు జూదంలో ఓడిపోయి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. అప్పటివరకు రాజభోగాలు అనుభవించిన వారు అడవుల్లో చెట్ల కింద బతకాల్సి వచ్చింది. ఆకులు, దుంపలు తినాల్సి వచ్చింది. ఆ పదమూడు సంవత్సరాలు వారికి పరీక్షా కాలం. వారు భయపడలేదు, బాధపడలేదు, నిరాశ చెందలేదు. అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసినా కూడా కౌరవులు వాళ్లకి రాజ్యాన్ని తిరిగి ఇవ్వరని గ్రహించారు. అందుకే వాళ్లు ఆ పదమూడు సంవత్సరాల కాలాన్ని వృధా చేయలేదు. భవిష్యత్తులో వాళ్లు కౌరవులతో చేయబోయే యుద్ధానికి ప్రణాళికలు తయారు చేసుకున్నారు. యుద్ధానికి కావలసిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. యుద్ధ విద్యల్లో నైపుణ్యాన్ని పెంచుకున్నారు. తిరుగులేని మహావీరులుగా తయారయ్యారు. నీకు కూడా ఈ సంవత్సర కాలం పరీక్షా కాలమే!” అవినాష్ జాగ్రత్తగా వింటున్నాడు.
”భవిష్యత్తులో నువ్వేం కావాలన్నది నిర్ణయించుకో! అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకో! కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు” అంటూ అవినాష్ మనసులో ఏర్పడ్డ నిరాశను పోగొట్టే ప్రయత్నం చేసింది సుభద్ర.
నీటిలో వేసిన పాలచుక్క క్రమంగా నీరంతా వ్యాపించినట్టు, సుభద్ర నింపిన స్పూర్తి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
ఇంజనీరింగ్ చదువుతున్న సుభద్ర కొడుకు కాలేజీ నుండి వచ్చాడు. అవినాష్ అతనితో మాట్లాడాడు. ఇంజనీరింగ్ గురించి తనకున్న అవగాహనను మరింత పెంచుకున్నాు. ఆ రాత్రంతా ఆలోచించాడు.
”అత్తయ్యా! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇక్కడే పట్నంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్పించే వృత్తివిద్యా కోర్సులో చేరుతాను. ఈ ఏడాది ఎంతో కొంత ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాను. ప్రతిరోజు సాయంత్రం నేను ఫెయిల్ అయిన సబ్జెక్టు చదువుకుంటాను. వచ్చే సప్లమెంటరీలో మంచి మార్కులతో పాసవుతాను. సమయం వృధా చేయకుండా, వీలు చిక్కినప్పుడల్లా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షకు చదువుతాను. మంచి కాలేజీలో సీటు సంపాయిస్తాను” ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మేనల్లుడి మాటలకు సుభద్ర సంతోషపడింది. కాస్త దగ్గరుండి వాడికి తన లక్ష్యాన్ని గుర్తుచేస్తూ, ప్రోత్సహిస్తే జీవితంలో నిలబడగలడని అనిపించింది సుభద్రకు.
– పేట యుగంధర్, 9492571731