పరీక్షలు వాయిదా వేయం…

Exams are not postponed..– విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు
– పేద విద్యార్థులను దీక్షల పేరుతో రెచ్చగొట్టొద్దు
– దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్‌, హరీశ్‌ కలిసి ఓయూలో దీక్ష చేయండి..
– ప్రభుత్వమే వారికి రక్షణ ఇస్తుంది
– నిరుద్యోగులతో వ్యాపారం సరికాదు
– రుణమాఫీ తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు : మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
– రూ.వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
”నోటిఫికేషన్లు వాయిదా వేయాలని కొందరు విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు.. దళారీ మోసగాళ్ల ఉచ్చులో మీరు పడొద్దు. పేద విద్యార్థులను, పేద నేతలను దీక్ష పేరుతో రెచ్చగొట్టొద్దు.. దమ్ము ధైర్యం వుంటే, పరీక్షలు వాయిదా వేయాలని చేసే డిమాండ్‌లో వాస్తవం ఉంటే కేటీఆర్‌, హరీశ్‌రావు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే మా ప్రభుత్వం, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు రక్షణ కల్పిస్తారు” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. వన మహోత్సవంలో భాగంగా కలెక్టరేట్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యరంగం, ఆరోగ్యపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో ఎఎస్‌ఎన్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సభలో సీఎం ప్రసంగించారు.”11 వేలకు పైగా పోస్టులతో డిఎస్పీ నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఎన్నో ఏండ్లుగా జరగని డిఎస్పీని అడ్డుకోవాలని చూస్తున్నారు. గ్రూప్స్‌, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని దొంగలు గూడుపుఠాని చేస్తున్నారు. పదేపదే పరీక్షలు వాయిదా వేయాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోంది. పరీక్షలు పోస్ట్‌పోన్‌ చేయాలనే డిమాండ్‌ వెనుక కోచింగ్‌ సెంటర్ల కుట్ర దాగి ఉంది. వాళ్ల ధనదాహం కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పరీక్షలు రద్దు చేయాలని కొన్ని కోచింగ్‌ సెంటర్ల యజమానులు నన్ను కూడా కలిశారు. ఉద్యోగాలు ఇవ్వాలని మా ప్రభుత్వం దైర్యం చేస్తే.. ఎప్పుడు పార్టీ బలహీనపడితే.. అప్పుడు కేసీఆర్‌ విద్యార్థులను ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో శ్రీకాంతాచారి సహా ఎంతోమందిని పొట్టన పెట్టుకుని రాజకీయం నడిపారు. విద్యార్థుల చావులతో బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది. పరీక్షలు వాయిదా వేయాలని అమాయక విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొట్టడం కాదు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే బావ-బామ్మర్థులు ఇద్దరూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోండి. పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఆమరణ దీక్ష చేయండి. మా ప్రభుత్వంలో విద్యార్థి, యువజనులకు నష్టం జరుగుతుందని నిజంగా వారు అనుకుంటే బిల్లా రంగాలు కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగండి’ అని రేవంత్‌ అన్నారు.
నిరుద్యోగులు నష్టపోకూడదనే ప్రభుత్వ ఆలోచన
గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలవాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ తర్వాత ఎలా చేస్తారని వారే మళ్లీ కోర్టుకు వెళతారని అన్నారు. అలా చేయడం వల్ల నోటిఫికేషన్‌లో లేకుండా ఎలా పిలుస్తారని సుప్రీంకోర్టు పరీక్షను రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్‌ సెంటర్‌లో అమ్ముకున్నారని గుర్తుచేశారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదన్నారు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. పరీక్షలు జరిగితే కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌కు పుట్టగతులు ఉండవనే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
పరీక్షలు రద్దు చేయబోం
నోటిఫికేషన్లు రద్దు చేస్తే.. ఇంటర్‌నెట్‌ మాఫియా బాగుపడటమేగాక ముఖ్యంగా నిరుద్యోగులకు భరోసా లేకుండా పోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 10 ఏండ్లు, రాష్ట్రం వచ్చిన తర్వాత మరో 10 ఏండ్లు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూశారని అన్నారు. అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు. విద్యార్థుల శవాల మీద తమ రాజకీయ భవిష్యతును నిర్మించుకోవాలనుకోవడం బీఆర్‌ఎస్‌కు భావ్యం కాదన్నారు. నాటి శ్రీకాంత్‌ మరణం లాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలను వాయిదా వేయడం లేదని చెప్పారు.
తనదాకా వస్తేగానీ కేసీఆర్‌కు ఆ బాధ తెలియదు
‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. నాలుగు రోజులుగా హరీశ్‌, కేటీఆర్‌ ఢిల్లీలో తిరుగుతున్నారు. తనదాకా వస్తే గానీ కేసీఆర్‌కు ఆ బాధ తెలియదు. గత పదేండ్లలో ఎంతో మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోలేదా?. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి పాతిక రోజులు కాకముందే పడగొడతానని కేసీఆర్‌ అనలేదా?.. బీజేపీ బీఆర్‌ఎస్‌ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. ఇప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌ ఏదోదో మాట్లాడుతున్నారు. మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పాం. కేసీఆర్‌కు ఇక రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకుంటే ఫామ్‌హౌజ్‌లో పండుకో.. కాదని కాళ్ల కింద కట్టెలు పెడితే వీపులు విమానం మోత మోగిస్తాం” అని బీఆర్‌ఎస్‌ నేతనుద్దేశించి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
రుణమాఫీ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు
రైతు రుణమాఫీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. అప్పుల రాష్ట్రంగా మిగిల్చిన తెలంగాణలో నెల దాటి 10 రోజులైనా వేతనాలు వచ్చేవి కావని, ఇప్పుడు తాము మొదటి తేదీనే ఉద్యోగుల వేతనాలిచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నామని అన్నారు. తమ కార్యకర్తలు కాంగ్రెస్‌ రాజకీయ భవిష్యత్‌ను తమ భుజాల మీద వేసుకొని ఈ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలకుగాను 12 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని గెలిపించడం చారిత్రాత్మకం అన్నారు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్‌ పదవి ఏదైనా గెలుపు కోసం ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా నిరంతరం కృషి చేస్తానని అన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వడం ద్వారా వారి శ్రమను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. గెలిస్తే పొంగడం.. ఓడితే కుంగడం కాదు.. మనోధైర్యంతో ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించామన్నారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, ఆర్టీఎస్‌, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు ఈ ప్రభుత్వం అందరి సూచనలు, సలహాలు పాటిస్తుందన్నారు.

Spread the love