– సాగునీరు అందించే యోచన లేని సీఎం కేసీఆర్
– పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభమా? : జాగో తెలంగాణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజలకు సాగునీరు అందించేదాని కన్నా ఏ ప్రాజెక్టులో ఎక్కువ కమిషన్ వస్తుందనే దానిపైనే సీఎం కేసీఆర్ ఆలోచనంతా అని పలువురు వక్తలు విమర్శించారు. శనివారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాగో తెలంగాణ చైర్మెన్ జస్టిస్ చంద్రకుమార్, కన్వీనర్ ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని ఎక్కువ కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకే కేటాయిస్తూ ప్రజల అవసరాలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో 33 పంపులకుగానూ ఒక పంపు మాత్రమే ప్రారంభించి ఆయకట్టు ప్రాంత ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఏమి చెప్పుకోలేకే ఈ ప్రారంభోత్సవమని ఎద్దేవా చేశారు. ఆ ఒక్క పంపు ద్వారా కేవలం రెండున్నర వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని తెలిపారు. 30 అంతస్థుల మేడ కడుతున్నాననీ ప్రచారం చేసుకుని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టి గృహ ప్రవేశం చేసినట్టుగా కేసీఆర్ తీరు ఉందని విమర్శించారు. కెనాల్స్, పిల్ల కాలువలు నిర్మించకుండా ప్రాజెక్టుల ప్రారంభం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని నాశనం చేస్తున్న కేసీఆర్ విదేశాల్లో ఉంటే ఈ పాటికి జైల్లో వేసేవారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఓడించాలనీ, బీఆర్ఎస్ పార్టీకి పాలించే హక్కు లేదని తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, తెలంగాణ జల సాధన సమితి అధ్యక్షులు నైనాల గోవర్థన్ పాల్గొన్నారు.