శ్రీనగర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీనగర్‌లో శనివారం ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బెమినాలోని హమ్దానియా కాలనీలో ఓ పోలీస్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన పోలీస్‌ను మహ్మద్‌ హఫీజ్‌గా గుర్తించారు. కాల్పుల్లో గాయపడ్డ ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. మహ్మద్‌ హఫీజ్‌ పొట్టపై, చేతికి గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ఒక్కసారిగా కాల్పులు జరుగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎవరికి వారు భయంతో పరుగులు తీస్తూ తమను తాము రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఆ తర్వాత స్థానికులకు పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, ఇటీవల శ్రీనగర్‌లో ఈద్గా ప్రాంతంలో క్రికెట్‌ ఆడుతున్న ఇన్‌స్పెక్టర్‌పై సైతం ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. గాయపడ్డ మస్రూర్‌ అహ్మద్‌ 39 రోజుల తర్వాత చికిత్స పొందుతూ డిసెంబర్‌ 7న ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. ఉగ్రవాదులు అతి సమీపం నుంచి ఇన్‌స్పెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.

Spread the love