అదిరిపోయేలా దశాబ్ధి ఉత్సవాలు

– ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశంలో మంత్రి తలసాని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను హైదరాబాద్‌ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. ఈ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యెక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రత్యేకంగా సమావేశమై ఉత్సవాలు నిర్వహించే ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాల వారీగా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆయా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సవాల సందర్బంగా నిర్వహించే కార్యక్రమాల్లో నిమగం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love