0-5తో మలేషియా చేతిలో ఓటమి
సుదీర్మన్ కప్ ఫైనల్స్
సుజోవు (చైనా) : ప్రతిష్టాత్మక సుదీర్మన్ కప్ ఫైనల్స్ నుంచి భారత్ నిష్క్రమించింది. మలేషియా, చైనీస్ తైపీ, ఆస్ట్రేలియాతో కూడిన గ్రూప్-సిలో నిలిచిన టీమ్ ఇండియా.. గ్రూప్ దశలో తొలి రెండు జట్టు మ్యాచుల్లో దారుణ పరాజయాలు చవిచూసింది. పతకంపై ఆశలతో చైనాకు వెళ్లిన టీమ్ ఇండియా ఆరంభ రెండు మ్యాచుల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం మలేషియాతో జరిగిన జట్టు మ్యాచ్‌లో భారత్ 0-5తో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల, అశ్విని పొన్నప్ప జంట 16-21, 17-21తో పరాజయంతో మొదలెట్టగా.. మెన్స్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 16-21, 11-21తో, మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి 18-21, 19-21, మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి 15-21, 13-21తో పరాజయాలు చవిచూశారు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు తొలి గేమ్‌ను 21-14తో నెగ్గి గెలుపు ఆశలు రేపినా.. తర్వాతి రెండు గేముల్లో 10-21, 20-22తో నిరాశపరిచింది. 0-5తో వైట్‌వాష్ పరాజయం చవిచూసిన భారత్ గ్రూప్ దశ దాటే అవకాశాలు కోల్పోయింది. తొలుత చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-4తో ఓడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ ఇంకా జరుగలేదు. ఆస్ట్రేలియాపై భారత్ 5-0తో నెగ్గినా.. గ్రూప్-సి నుంచి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవు.