– ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం
– కులాల ప్రభావాన్ని ఊహించలేదు
– ఎగ్జిట్ పోల్స్‌పై సర్వే సంస్థల అంగీకారం
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మంచి ఆధిక్యత లభిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా వాస్తవ ఫలితాలు అందరికీ దిగ్భ్రాంతిని కలిగించాయి. ఉత్తరప్రదేశ్‌లో తమ అంచనాలు తప్పాయని పలు సర్వే సంస్థలు అంగీకరించాయి. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 37 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కూడా దాదాపు అంతే సంఖ్యలో స్థానాలు పొందింది. అయితే కాషాయ పార్టీకి యూపీలో 60 సీట్లు వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అన్నింటికంటే ఆశ్చర్యాన్ని కలిగించిన విషయమేమంటే అయోధ్య (ఫైజాబాద్)లో బీజేపీ అభ్యర్థి పరాజయం చవిచూశారు. అక్కడ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేష్ ప్రసాద్ గెలుపొందారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏకు 361 నుండి 401 స్థానాలు, ఇండియా బ్లాక్‌కు 131-166 స్థానాలు వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా తెలిపింది. తమ అంచనాలు తప్పడంపై యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్, ఎండీ ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ తాము అనుకున్న దాని కంటే ఎన్డీఏకు 60 స్థానాలు తక్కువ వచ్చాయని చెప్పారు. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌పై తాము సరైన అంచనాలు వేయలేకపోవడమే దీనికి కారణమని ఆయన అంగీకరించారు. దళితుల ఓట్లు ఎటు వెళ్లాయో ఊహించలేకపోయామని, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో సైతం తమ అంచనాల కంటే ఎన్డీఏకు 14, 10 స్థానాలు తగ్గాయని వివరించారు.
ఎన్డీఏకు 371-401 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ పోల్ తెలిపింది. యూపీ విషయంలో తమ అంచనాలు ఎందుకు తప్పాయో ఇంకా అధ్యయనం చేయలేదని సీఎన్‌ఎక్స్ డైరెక్టర్ భవేష్ ఝా చెప్పారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి తమ అంచనాలు దాదాపు వాస్తవ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయని తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్‌ను ‘మోడీ ఫాంటసీ పోల్స్’గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసేందుకు, డబ్బు సంపాదించాలని అనుకునే వారికి సాయపడేందుకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సర్వేల నిర్వాహ కులు, సెఫాలజిస్టులు మాత్రం తమను తాము సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అయితే కీలక రాష్ట్రంలో ప్రజల మొగ్గు ఎటు వైపు ఉన్నదో ఊహించడంలో విఫలమయ్యామని, తప్పుడు అంచనాలకు వచ్చామని అంగీకరించారు. ‘రాష్ట్రాల వారీగా వేసిన అంచనాల్లో కేవలం యూపీ విషయంలో మాత్రమే పొరపాటు జరిగింది. బెంగాల్, మహారాష్ట్రపై సరిగానే అంచనాలు వేశాం. యూపీలో మాత్రం అంచనాలు, ఫలితాలు వేర్వేరుగా ఉన్నాయి’ అని సీ ఓటర్‌కు చెందిన యశ్వంత్ దేశ్‌ముఖ్ చెప్పారు. ఎన్డీఏకు 353-383, ఇండియా బ్లాక్‌కు 152-182 స్థానాలు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ తెలిపింది. సీట్ల విష యంలో అంచనాలు తప్పినా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రం దాదాపుగా సరిగానే చెప్పామని దేశ్‌ముఖ్ తెలిపారు. ఎన్డీఏకు 362-392, ఇండియా బ్లాక్‌కు 141-161 సీట్లు వస్తాయని జన్ కీ బాత్ చెప్పింది. యూపీలో ప్రభుత్వ వ్యతిరేకత, కుల ప్రభావాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయామని జన్ కీ బాత్‌కు చెందిన ప్రదీప్ భండారీ చెప్పారు. సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి అంచనాలు రూపొందిస్తామని, అయితే యూపీలో కులాల ప్రభావాన్ని సరిగా ఊహించలేదని ఆయన తెలిపారు.