రోహిణి కమిషన్‌ ఖర్చుల రికార్డులు గాయబ్‌ !

– 2021 సెప్టెంబర్‌ నుంచి అందుబాటులో లేని వివరాలు
న్యూఢిల్లీ : ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) వర్గీకరణపై ఏర్పాటైన జస్టిస్‌ జి. రోహిణి కమిషన్‌ కార్యాలయపు ఖర్చుల వివరాలు 2021 సెప్టెంబర్‌ నుండి తమ వద్ద అందుబాటులో లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద హిందూ దినపత్రిక అందించిన దరఖాస్తుకు ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. సుమారు మూడు వేల ఓబీసీ కులాలను వర్గీకరించేందుకు 2017లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. నివేదిక సమర్పించేందుకు తొలుత 12 వారాల గడువు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దానిని 14 సార్లు పొడిగించారు. ఈ సంవత్సరం జనవరిలో చివరిసారిగా ఈ కమిషన్‌కు పొడిగింపు లభించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి. రోహిణి నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీలో డాక్టర్‌ జేకే బజాజ్‌, ఇతర అధికారులు సభ్యులుగా ఉన్నారు.
ఆర్‌టీఐ కింద పొందిన వివరాల ప్రకారం 2017 అక్టోబర్‌ నుండి ఈ సంవత్సరం ఏప్రిల్‌ వరకూ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, ఇతర సభ్యుల జీతాల నిమిత్తం రూ.3,75,53,250 ఖర్చు చేయగా కన్సల్టెంట్ల జీతాల కోసం రూ.26,04,775 చెల్లించారు. కార్యాలయ ఖర్చులు, ఇతరాల కింద 2021 ఆగస్ట్‌ వరకూ రూ.7,20,000 ఖర్చు చేశామని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఆ ఖర్చులకు సంబంధించి తన వద్ద ఎలాంటి రికార్డులు లేవని స్పష్టం చేసింది. 2021 ఆగస్ట్‌ వరకూ జాతీయ బీసీ కమిషన్‌ ఈ ఖర్చులను భరించింది. ఆ తర్వాత సామాజిక న్యాయ-సాధికారత మంత్రిత్వ శాఖ నేరుగా చెల్లింపులు జరిపింది. అయితే సంబంధిత అధికారి ఖర్చుల వివరాలు నమోదు చేయకపోవడం వల్లనే తమ వద్ద సమాచారమేదీ అందుబాటులో లేదని మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో గడువు పొడిగింపు పొందకముందే కమిషన్‌ తన పని పూర్తి చేసిందని హిందూ పత్రిక తెలపగా నివేదికను ఖరారు చేసే పనిలో ఉన్నదని, కొన్ని అనుబంధాలను చేరుస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. కమిషన్‌ చేయాల్సిన పని చాలా ఉందని, కొంత సమయం అవసరమని ప్రభుత్వం కూడా గడువు పొడిగింపును సమర్ధించుకుంది. అంతకుముందు కోవిడ్‌ను సాకుగా చూపుతూ కమిషన్‌ గడువును పలు పర్యాయాలు పొడిగించింది.

Spread the love