ఖరీదైపోతున్న విద్య

– విద్యాసంస్థల ఫీజులుం
– చదవుకొనలేకపోతున్న పేదలు
– సామాన్యుల కలలను ఛిన్నాభిన్నం
– విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో విద్య ఒక ఖరీదైన వస్తువుగా మారుతున్నది. ప్రభుత్వాల పర్యవేక్షణ కొరవడటంతో కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజులతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యను వ్యాపారం చేస్తూ లాభార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. అయితే, ఈ విధానమే దేశంలోని సామాన్య ప్రజల కలలను కల్లలు చేస్తున్నది. పేద విద్యార్థులు డబ్బులు వెచ్చించి చదువుకొనలేక విద్యకు దూరమవుతున్నారని విద్యావేత్తలు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరును వారు తప్పుబడుతున్నారు. విద్యాసంస్థలను కట్టడి చేయాలనీ, వాటిపై ప్రభుత్వ పర్యవేక్షణ తప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు. విద్యాసంస్థల తీరు పేద విద్యార్థులకు శాపంగా మారుతున్నది. తమ పిల్లలను చదువుకు దూరం చేయకూడదన్న తల్లిదండ్రుల తపన విద్యాసంస్థలకు ఆయుధంగా మారుతున్నది. ఈ క్రమంలో భారీ మొత్తంలో ఫీజులు చెల్లించలేక పిల్లల తల్లిదండ్రులు నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సైతం చోటు చేసుకోవటం గమనార్హం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు, ముఖ్యంగా ఇంజినీరింగ్‌, మెడికల్‌, ఇతర వృత్తిపరమైన కోర్సులలో, ఫీజులు, ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీని కారణంగా సాధారణ పేద, శ్రామిక కుటుంబాలకు విద్య అందుబాటులో లేకుండా పోతున్నదని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కలే దేశంలోని ఈ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. కనీసం ప్రాథమిక విద్యను సైతం పైన పేర్కొన్న వర్గాలు భరించలేకపోతున్నాయని చెప్తున్నారు.
ఒక సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో ఒక సాధారణ కార్మికుని సగటు నెలవారీ ఆదాయంలో 38 శాతం వరకు అతని ఇద్దరు పిల్లల చదువులకే ఖర్చు అవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక తాత్కాలిక కూలీకి వచ్చే మొత్తం నెలవారీ ఆదాయంలో దాదాపు 15.2 శాతం విద్య కోసం ఖర్చు చేయబడుతున్నది. అదేవిధంగా పట్టణ ప్రాంత సాధారణ కార్మికుని సగటు నెలవారీ ఆదాయంలో 14 శాతం, గ్రామీణ ప్రాంతంలో శాశ్వత కూలీ ఆదాయంలో 6.5 శాతం ఇద్దరు పిల్లల చదువులకే వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ లేదా తాత్కాలిక కార్మికుడి నెలవారీ ఆదాయంలో 26.5 శాతం ఉన్నత మాధ్యమిక విద్యకు, 34.3 శాతం ఇద్దరు పిల్లల గ్రాడ్యుయేషన్‌కు, పట్టణ ప్రాంతాల్లోని ఒక సాధారణ కార్మికుని నెలవారీ ఆదాయంలో దాదాపు 56 శాతం ఇద్దరు పిల్లల ఉన్నత మాధ్యమిక విద్యకు ఖర్చు చేస్తున్నారు.గతనెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు (సీపీఐ) 4.8 శాతంగా నమోదైనప్పుడు, విద్య ద్రవ్యోల్బణం రేటు 5.92 శాతంగా ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో విద్య ద్రవ్యోల్బణం రేటు 6.37 శాతంగా.నమోదైంది. బిజినెస్‌లైన్‌ వార్తాపత్రికలోని ఒక నివేదిక ప్రకారం.. 2014 జూన్‌ నుంచి 2018 జూన్‌ మధ్య ప్రాథమిక విద్య ఫీజులు మొదలైన వాటిపై 30.7 శాతం భారీ పెరుగుదల నమోదైంది. అదేవిధంగా, ఒక సెకండరీ తరగతుల ఖర్చులలో 21 శాతం పెరుగుదల నమోదైంది. కానీ ఇంజినీరింగ్‌ నుంచి మెడికల్‌, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సుల వరకు ఈ ద్రవ్యోల్బణం ప్రభావం ఉన్నది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు కూడా స్థాయిని మించి ఖర్చు చేస్తున్నారు అని తేలింది.
ప్రభుత్వ ఐఐటీలు, ఐఐఎంల ఫీజులు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీన్ని బట్టి ప్రయివేటు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల ఫీజులను అంచనా వేయవచ్చు. విద్యానిపుణుల సమాచారం ప్రకారం.. ఐఐఎం (అహ్మదాబాద్‌) ఫీజులు 2007 నుంచి 2022 మధ్య 15 సంవత్సరాలలో సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరిగాయి. ఈ పెరుగుదల 575 శాతం కావటం గమనార్హం. మరో అంచనా ప్రకారం.. దేశంలోని మొదటి నాలుగు ఐఐఎంల సగటు వార్షిక రుసుము రూ. 25 లక్షల కంటే ఎక్కువగా ఉన్నది.
ప్రభుత్వ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఇతర ప్రొఫెషనల్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్‌స్టిట్యూట్‌ల ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రయివేటు ఇన్‌స్టిట్యూట్‌ల ఫీజుల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని నిపుణులు తెలిపారు. ఉదాహరణకు, బెంగుళూరులోని ప్రభుత్వ నేషనల్‌ లా స్కూల్‌ యూనివర్సిటీ వార్షిక రుసుము రూ.3.2 లక్షలు (హాస్టల్‌,మెస్‌తో సహా). ప్ర్రయివేటురంగ జిందాల్‌ లా స్కూల్‌ వార్షిక రుసుము రూ.8.92 లక్షలు, సింబయాసిస్‌ లా స్కూల్‌ వార్షిక రుసుము రూ.6.2 లక్షలుగా ఉండటం గమనార్హం.
భారీ మొత్తంలో ఉన్న ఫీజులను నియంత్రించి ప్రతి విద్యార్థికి విద్యనందించాల్సిన ప్రభుత్వాలే.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫీజులను అధికంగా వసూలు చేయటం ఆందోళనకరమని సామాజికవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే పేదలు, శ్రామిక వర్గాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలకు చదువునెలా అందించగలవని ప్రశ్నించారు. విద్య అనేది అందకపోతే దేశంలో అసమానత తీవ్రంగా ఏర్పడుతుందనీ, అది దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

Spread the love