కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు… కాదేదీ వ్యాపారానికి అనర్హం అని రుజువు చేసింది బిజియశాంతి… మణిపూర్‌కు చెందిన ఈ పారిశ్రామికవేత్త తామర కాండంతో ప్రయోగాలు ప్రారంభించింది. ఎంతో కృషి చేసి వాటితో బట్టలు తయారు చేస్తోంది. మణిపూర్‌లోని థాంగా గ్రామంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న లోక్‌టాక్ సరస్సులో లభించే తామరపువ్వులను దీని కోసం ఉపయోగిస్తోంది. తామర కాండం పీచుతో కండువాలు, మఫ్లర్లు, స్టోల్స్‌తో పాటు నెక్ టైస్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
వృక్షశాస్త్రజ్ఞురాలైన బిజియశాంతి తామర కాండం నుండి ఫైబర్‌ని సేకరించి, సహజ రంగులు వేసిన స్టోల్స్, స్కార్ఫ్‌లు, మఫ్లర్‌లు, నెక్ టైస్ వంటి విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తున్న దేశంలోనే మొదటి వ్యక్తి. అయితే రెండేండ్లు తను ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి చాలా ప్రయత్నిస్తోంది. కానీ తీసుకునేవారు లేకపోవడంతో నిరాశ చెందింది. వీటిపై ప్రజలకు అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణం. చివరకు తన నైపుణ్యంతో ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది.
పర్యావరణ అనుకూలమైన ఫాబ్రిక్
బిజియశాంతి మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలోని లోక్‌తక్ సరస్సుకు సమీపంలోని తంగా గ్రామంలో పెరిగింది. తన గ్రామంలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ఆమె వృక్షశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం ఇంఫాల్‌కు వెళ్లింది. తర్వాత అగ్రి టూరిజం వ్యాపారాన్ని ప్రారంభించింది. కానీ అది పెద్దగా పని చేయలేదు. లోక్‌తక్ సరస్సులో సమృద్ధిగా పెరిగిన తామర పువ్వులు చూసి ఆమె ఎప్పుడూ మురిసిపోతుండేది. వాటిని చూస్తున్న ఆమె మనసులోకి ఓ విచిత్రమైన ఆలోచన ప్రవేశించినట్టు ఆమె గుర్తుచేసుకుంది. కమలాన్ని వివిధ ఉత్పత్తులను తయారు చేయడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అని తీవ్రంగా ఆలోచించింది. తామర పువ్వు, దాని లక్షణాలను అర్థం చేసుకోవడానికి పత్రికలతో పాటు పరిశోధనా అధ్యయనాలను పరిశీలించింది.
తామరలో ఔషధ విలువలు
పువ్వును ఉపయోగించి నప్పుడు సాధారణంగా కాండం వృధా అవుతుందని ఆమె అర్థం చేసుకుంది. దీన్ని బేస్‌గా ఉపయోగించి ఆమె పర్యావరణ అనుకూల బట్టల గురించి మరింత అధ్యయనం చేసింది. ఫైబర్‌ను తయారు చేయడానికి తామర కాండంతో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచన 2017లో ఆమె మదిలో వేళ్లూనుకుంది. తామర కాండం నుండి పీచును తీయడానికి రెండేండ్లు శ్రమించింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (వీూవీజు) మంత్రిత్వ శాఖ నిర్వహించిన వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమంలో కూడా చేరింది. ‘తామర మొక్కలో చాలా ఔషధ విలువలు ఉన్నాయని నా పరిశోధనలో తెలుసుకున్నాను. తామర రేకుల నుండి టీ తయారు చేయవచ్చు. అంతేకాదు దీని కొమ్మ అత్యంత పర్యావరణ అనుకూలమైన ఫైబర్‌లలో ఒకటి. ఇది సహజంగా మృదువైన ఫాబ్రిక్, దాదాపు ముడతలు లేనిది’ అని ఆమె పంచుకుంది.
మహిళా సమిష్టి శక్తి
బిజియశాంతి తెల్లవారుజామున సరస్సుకు వెళ్ళి, కాండాలను సేకరించి, ఫైబర్‌లను మృదువుగా చేయడానికి వాటిని ఒక రోజు నీటిలో నానబెడుతుంది. చిన్న కత్తితో తంతువులను తీసి కాండాలను కత్తిరిస్తుంది. అరచేతికి ఒక ప్లాంక్ ఉపయోగించి ఫైబర్ చుడతారు. ఈ ఫైబర్ వివిధ ఉత్పత్తులను నేయడానికి ఉపయోగిస్తారు. ‘నేను 2019లో సనాజింగ్ సనా తంబల్ అనే సమిష్టిని ప్రారంభించాను. స్థానికంగా ఉన్న 10 మంది మహిళలతో కలిసి ఫైబర్‌ల నుండి దారాన్ని తీయడంలో సహాయం చేసాను. వారి ఇళ్లల్లోనే దీన్ని ఎలా చేయాలో వారికి నేర్పించాను. ఇది వారి కుటుంబాలను పోషించడానికి అవసరమైన ఆదాయాన్ని కూడా ఇస్తుంది. మా ప్రాంతంలోని చేనేత కార్మికులతో కూడా కలిసి పనిచేశాను. వారు వివిధ ఉత్పత్తులను రూపొందించడానికి లోటస్ స్టెమ్ ఫైబర్‌లతో పనిచేయడం ప్రారంభించారు’ అని బిజియశాంతి జతచేస్తుంది.
దీని ప్రక్రియే కష్టం
సమిష్టి సమూహంలో ఇప్పుడు 30 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు నేత కార్మికులు తంగాలోని యూనిట్‌లో పూర్తి సమయం పని చేస్తున్నారు. ఉత్పత్తులు సనాజింగ్ సనా తంబల్ వెబ్‌సైట్‌తో పాటు దాని ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా విక్రయించబడ తాయి. అవసరాలకు అనుగుణంగా కూడా అనుకూలీకరించబడతాయి. మహిళలు చేసే పని, గంటల ప్రకారం నెలకు రూ. 7,000-12,000 మధ్య సంపాదిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి నెలకు మూడు నుండి ఐదు ఆర్డర్‌లు సరిపోతాయని ఆమె అంటుంది. పెద్ద ఆర్డర్‌ల కోసం ఆమె మొదటి నుండి ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె తన వ్యాపారానికి అవసరమైన టెక్నాలజీ, మార్గదర్శకత్వం కోసం నార్త్ ఈస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫండ్, అస్సాం అగ్రికల్చరల్ యూనివర్శిటీ నుండి మద్దతు పొందింది. ఇటీవల ఆమె టెక్సాస్ నుండి భారీ ఆర్డర్‌ను తిరస్కరించవలసి వచ్చింది. ఎందుకంటే అది యూనిట్ డిమాండ్‌కు అనుగుణంగా లేదు. ఆమె ప్రధాన సవాలు ప్రక్రియ కోసం పట్టే సమయం.
నిధుల కోసం చూస్తున్నాను
‘ఈ ఉత్పత్తుల ధర చాలా ఖరీదైనది. ఒక స్కార్ఫ్ ధర రూ. 18,000 ఉంటుంది. ఒక మీటర్ ఫాబ్రిక్ రూ. 27,000 నుండి మొదలవుతుంది. అలాగే తామర కాండం సేకరించడం, ఫైబర్ తీయడం, నేయడానికి సమయం పడుతుంది. ఒక్క స్కార్ఫ్ తయారు చేయడానికి రెండు నెలలు పడుతుంది. అలాగే కాండం ముందే సేకరించి నిల్వ చేయలేము. వాటిని తాజాగా ఉపయోగించాలి. నేను నా వ్యాపారాన్ని స్కేల్ చేయాలని ఆశిస్తున్నాను. దీనికి అవసరమైన నిధుల కోసం చూస్తున్నాను. ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలని, లోటస్ స్టెమ్ ఫైబర్‌తో మరిన్ని ఉత్పత్తులను తయారు చేయాలని, పెద్ద మార్కెట్‌లలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నాను” అని ఆమె చెప్పింది.