నవతెలంగాణ హైదరాబాద్: నగర శివార్లలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పేలుడు కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం స్టేషన్ ఆవరణలోని రికార్డులు భద్రపరిచే గదిలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. చెత్తను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పేలడంతో రికార్డ్ రూమ్ రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో జీఎంఆర్ సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికురాలు శాంతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్టేషన్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా, పేలుడు కారణంగా రికార్డు గదిలో ఉన్న కొన్ని కీలక డాక్యుమెంట్లు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. అయితే ఖాళీ సీసాలో గ్యాస్ పేరుకుపోవడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.