– ఆగస్టు 5వరకు ఆన్‌లైన్‌లో.. 9 వరకు నేరుగా స్వీకరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిమ్స్ ఆస్పత్రిలో ఎంహెచ్‌ఎం కోర్సు కోసం దరఖాస్తుల గడువు తేదీని పొడిగించారు. రూ.లక్షల్లో వేతనం.. గౌరవ ప్రద జీవితం కావాలనుకునే కలను నిమ్స్ వైద్య కళాశాల నిర్వహిస్తున్న మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఎం) కోర్సుతో సాకారం చేసుకోవచ్చని నిమ్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం హెచ్‌ఓడీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కోర్సు అకాడమిక్ ఇన్‌చార్జి డాక్టర్ మార్త రమేశ్ తెలిపారు. రెండున్నరేండ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సును పూర్తి చేసిన వారికి బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. సోమవారం నిమ్స్ ఆస్పత్రిలో వారు మీడియాకు వివరాలు వెల్లడించారు. దేశంలోనే ఎంహెచ్‌ఎం కోర్సు అందిస్తున్న వైద్య, విద్యాసంస్థ ఒక్క నిమ్స్ మాత్రమేనని తెలిపారు. నిమ్స్ ఎంహెచ్‌ఎం కోర్సు 19 ఏండ్లు పూర్తి చేసుకొందని, ఈ కోర్సు చేసిన వందలాది మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని వివరించారు. 20వ సంవత్సరం 20 సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో, 9వ తేదీ వరకు నేరుగా దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
అర్హతలు ఇలా..
ఎంహెచ్‌ఎం కోర్సులో చేరేందుకు అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి.. 2023 డిసెంబర్ 31 నాటికి 30 ఏండ్లలోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి మూడేండ్ల సడలింపు ఉంటుంది. ఆయా అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. అర్హులైన వారికి వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుంది.
అద్భుత అవకాశాలు..
హైదరాబాద్ మెడికల్ హబ్ రంగంలో ఈ కోర్సు చేసిన వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని సత్యనారాయణ, రమేశ్ తెలిపారు. ఫార్మా, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ టూరిజం, ప్రభుత్వ, ప్రయివేటు దవాఖానలు, హెల్త్‌కేర్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్, మెడికల్ కోడింగ్ లాంటి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. ఈ కోర్సులో చేరిన అర్హులైన వారికి వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, టీఎస్‌ఆర్టీసీలో ఇతర విద్యార్థుల మాదిరిగా బస్సు పాస్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. వివరాలకు షషష.అఱఎర.వసబ.ఱఅ వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.