యూసీసీపై 28వరకు గడువు పెంపు !

న్యూఢిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియచేసేందుకు గడువును జులై 28వరకు లా కమిషన్‌ పొడిగించింది. యూసీసీపై ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలను తెలియచేయాల్సిందిగా జూన్‌ 14న లా కమిషన్‌ కోరింది. ఇచ్చిన ఒక నెల గడువు శుక్రవారంతో ముగిసింది. దాంతో మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 50లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ప్రజల నుంచి అధిక రీతిలో ప్రతిస్పందనలు వస్తున్నాయని, తమ వ్యాఖ్యలు తెలియచేయడానికి మరికొంత సమయం కావాలంటూ వివిధ వర్గాల నుంచి లెక్కికు మించి అభ్యర్ధనలు వచ్చాయని లా కమిషన్‌, పబ్లిక్‌ నోటీసులో తెలిపింది. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు లేదా సంఘాలు ఈ అంశంపై 28వ తేదీలోగా లా కమిషన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలని కోరింది.

Spread the love