– భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులు పక్కదారి
– టెస్టులు చేయకున్నా చేసినట్టు లెక్కలు..దారిమళ్లుతున్న వందల కోట్లు
– కార్డులు రద్దవుతాయంటూ బెదిరింపులు.. అవసరం లేకున్నా టెస్టులు
– ప్రయివేటు కంపెనీకి దొడ్డిదారిన కట్టబెట్టిన బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు :
– సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికులకు వైద్య పరీక్షల పేరిట పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నదనీ, వారి వెల్ఫేర్ బోర్డు నుంచి వందల కోట్ల రూపాయల నిధులు పక్కదోవ పడుతున్నాయని సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ చెప్పారు. వైద్యపరీక్షల పేరుతో జరుగుతున్న దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ క్రాస్‌రోడ్డులోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2022లో సీఎస్‌సీ హెల్త్‌కేర్ వెల్‌నెస్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థకు కాంట్రాక్టు ఇచ్చాయని తెలిపారు. సంస్థ స్థాపించి ఏడాది గడవకముందే రాష్ట్రమంతటా టెస్టులు చేసే అవకాశం ఆ సంస్థకు ఎలా ఇచ్చారు? అంతే ధరలో అపోలో, యశోద, విజయా డయాగస్టిక్ సెంటర్‌లో టెస్టులు చేస్తుంటే కొత్త సంస్థకు ఇవ్వడమేంటి? టెండర్లు వేయకుండా నేరుగా ఆ సంస్థకు ఎందుకిచ్చారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడే అవినీతికి బీజం పడిందని తెలిపారు. రాష్ట్రంలో 14 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులుండగా అందులో ఇప్పటికే 11 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారన్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులకూ కూడా పరీక్షలు చేయించాలనీ, చేయించుకోకపోతే కార్డులు రద్దవుతాయని కార్మికులను సీఎస్‌సీ సంస్థ బెదిరించడమేంటని ప్రశ్నించారు. వందల సంఖ్యలో ఆరోగ్య క్యాంపులు నిర్వహిస్తున్నట్టు, కార్మికులకు వైద్య పరీక్షలు చేస్తున్నట్టు లెక్కలు చూపడం దారుణమన్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని గుండె పరీక్షలు కూడా చేశామని రిపోర్టులు ఎలా ఇస్తారని నిలదీశారు. రిపోర్టులకు సంబంధించిన పలు ఆధారాలను కూడా మీడియాకు చూపెట్టారు. ఎవరైనా కార్మికుడు అనారోగ్యం పాలైతే ఆ రోగానికి సంబంధించిన టెస్టులు చేయిస్తే బాగుంటుందిగానీ అవసరం లేకున్నా ఈ పరీక్షలు ఏంటని ప్రశ్నించారు. బీఓసీడబ్ల్యూ గతేడాది ఆరోగ్య పరీక్షల కోసం రూ.124 ఖర్చుచేసిందనీ, ఈ ఏడాది కూడా భారీ ఖర్చుగా పెడుతున్నారని గణాంకాలతో వివరించారు. కార్మిక శాఖ అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయి నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిర్మాణ కార్మికులకు వైద్య పరీక్షల పేరిట జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలనీ, సీఎస్‌సీ హెల్త్‌కేర్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఆరోగ్య పరీక్షలు అవసరమైతే ఉచితంగా నిర్వహించేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్‌సీతో ఒప్పందంపై సమగ్ర విచారణ జరిపించాలనీ, బాధ్యులైన అధికారులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, మహేందర్, భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కార్యదర్శి బి.మధు, తదితరులు పాల్గొన్నారు.