ఫీజుల దోపిడీ..!

– వ్యాపార సంస్థలుగా విద్యాసంస్థలు నిబంధనాలకు విరుద్ధంగా నిర్వాహణ
– ఆదాయమే పరమావధిగా ప్రయివేటు స్కూల్స్‌ యాజమాన్యాలు
– డొనేషన్ల పేరుతో వసూళ్లు
– ఇష్టానుసారంగా ఫీజుల పెంపు

– విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం
– ప్రయివేటు స్కూల్‌ యాజమాన్యాల అగడాలకు అడ్డుకట్ట వేసే విద్యాశాఖ అధికారుల్లో నిర్లక్ష్యం

– అధిక ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని
– డిమాండ్‌ చేస్తున్న విద్యార్థి సంఘాలు
సేవా దృక్పథంతో మొదలైన విద్యాసంస్థలు.. వ్యాపార సంస్థలుగా తయారయ్యాయి. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా ప్రయివేటు స్కూల్‌ యాజమాన్యాలు విద్యా సంస్థలను నడుపుతున్నాయి. ఆదాయం పెంచుకోవడమే తమ పరమావధిగా ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని ధిక్కారించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు ఎందుకు..! నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి. తమ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న ప్రయివేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రయివేట్‌ పాఠశాలల ఫీజుల దోపిడీపై కథనం..
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో అత్యధిక ప్రయివేటు స్కూల్‌ ఉన్న జిల్లాలో మొదటి స్థానం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఎడ్యుకెషన్‌ హబ్‌గా మారింది. జిల్లాలో బడ్జెట్‌ స్కూల్స్‌ మొదలు అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల వరకు ఉన్నాయి. ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రయివేటు స్కూల్‌ 2 వేలు ఉన్నట్టు విద్యాశాఖ అధికారుల లెక్కలు ఉన్నాయి. ఇక గుర్తింపు లేని స్కూల్స్‌ కూడా మరో 500లకు పైచిలుకు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఒక స్కూల్‌ పర్మిషన్‌తో మరో స్కూల్‌ నడిపించే క్రమంలో ప్రభుత్వ గుర్తింపు లేని స్కూల్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
డొనేషన్ల పేరుతో వసూళ్లు
పాఠశాలల నిర్వాహణనే సేవా దృక్పథం అయినప్పుడు.. ఇక పాఠశాల డెవలప్‌మెంట్‌ కోసం విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో డబ్బులు వసూళ్లు చేయడం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో కొన్ని మైనార్టి స్కూల్స్‌ ఫ్రీ ఎడ్యుకేషన్‌ పేరుతో స్కూల్స్‌ ప్రారంభించినప్పటికీ రూ. లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. అడ్మిషన్‌ ఫీజు రూ. 20 వేలు తగ్గకుండా తీసుకుంటు న్నాయి. ఇక ట్యూషన్‌ ఫీజులకు అంతే లేదు.. నర్సరిలో పిల్లవాడికి కనిసం పెన్సిల్‌ కూడా పట్టుకోవడానికి రాదు ఆ పిల్లవాడి ఫీజు మాత్రం తాను మో యలేనంత రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేస్తున్నారు. స్కూల్‌లో జాయినింగ్‌ మొదలు ఇక విద్యార్థి తల్లిదండ్రులను ఆర్థికంగా పీడ్చుకు తినడమే ప్రయివేటు స్కూల్‌ యాజమాన్యాల పనిగా ఉంది. ఆడ్మిషన్‌ ఫీజు మొదలు, బుక్స్‌, యూనిఫామ్‌, స్కూల్‌ డొనేషన్స్‌, ట్యూషన్‌ ఫీజు, కల్చరల్స్‌ ప్రోగ్రాం ఫీజు ఇలా వారికి తోసిన కాడికి ఫీజులు వసూళ్లు చేస్తున్నారు.
ఇష్టానుసారంగా ఫీజుల పెంపు…
ప్రతియేటా ప్రయివేటు స్కూల్స్‌ విద్యాహక్కు చట్టం ప్రకారం పది శాతానికి మించకుండా ఫీజు పెంచుకోవ డానికి విద్యాశాఖ నుంచి పర్మిషన్‌ తీసుకోవాలి. కానీ జిల్లాలో అలాంటి పరిస్థితి లేదు. తమకు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటున్నాయి. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ పబ్లిక్‌ స్కూల్‌, సెంట్‌ జోసప్‌ పబ్లిక్‌ స్కూల్‌, లక్ష్యా ఇంటర్‌నేషన్‌ స్కూల్‌, బాష్యం బ్లూంస్‌, శ్రీచైతన్యా, నారాయణ, బ్రిలియంట్‌ ఇలా కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమకు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను పీడ్చుకుతింటున్న పరిస్థితి నెలకొంది.
పర్మిషన్లు లేకుండా నిర్వాహణ
సెంట్రబ్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, ఐసీఐఎస్‌ (ఇండియన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెండరీ ఎడ్యుకేషన్ల) నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా.. సీబీఎస్‌, ఐసీఐఎస్‌ స్టడెండ్‌ స్కూల్స్‌ పేరుతో రూ.లక్ష ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. వీటిపై జిల్లాలో ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.

అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలి
అడ్మిషన్లు, డొనషన్లల పేరుతో ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి. మార్కెట్‌ రేటుకు రెండింతలు ధరలు పెంచి బుక్స్‌, యూనిఫామ్స్‌ను విక్రయిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసు కోవాలి. తమ ఇష్టానుసారంగా యేటికేడు ఫీజులు పెంచుతున్న విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పెంచాలి. అధిక ఫీజుల వసూళ్లును నియంత్రించాలి.
– బి.శంకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

Spread the love