– బాబును విడుదల చేయాలని ఖమ్మంలో భారీ ర్యాలీ
– అరెస్టును ఖండిస్తూ పార్టీలకతీతంగా ప్రదర్శన
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి పలుచోట్ల భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మంలో అనేకమంది మహిళలు వీధుల్లోకి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు నినదించారు. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ నల్లజెండాలు, ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగకుండా జైలు నుండి విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలకు అతీతంగా బాబు అభిమానులు అనేకమంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ర్యాలీలో అధికంగా కనిపించారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల్ల వెంకటేశ్వరరావు సహా అనేకమంది ర్యాలీ అగ్రభాగాన ఉన్నారు. ఆదివారం కాంగ్రెస్ విజయభేరి సభ ఉండటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు హైదరాబాదు వెళ్లారు. అయినప్పటికీ ఆ పార్టీకి చెందిన మహిళా నాయకులు పలువురు ర్యాలీకి హాజరయ్యారు. కాంగ్రెస్ జిల్లా నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కార్పొరేటర్ మిక్కిలినేని మంజులతో పాటు పలువురు ర్యాలీలో కనిపించారు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు సైతం ఖండించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సైతం పోటాపోటీగా ఖండిస్తున్నారు. కానీ ఇరుపార్టీల జిల్లా అధినాయకత్వం నుంచి ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన వెలువడక పోవడం సీబీఎన్ అభిమానులను కలిచివేస్తోంది. మొత్తమ్మీద బాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది.