– విశ్వవిజేత రోహిత్‌సేనకు అఖండ స్వాగతం
– అభిమాన సంద్రంలా మెరైన్ డ్రైవ్
– రూ.125 కోట్ల నజరానా
అభిమానం ఉప్పొంగింది. విశ్వవిజేత విజయ గర్వం ఆకాశానికి ఎగిసింది. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియం వరకు ముంబయి రోడ్లు జన సంద్రాన్ని తలపించగా.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమ్ ఇండియా ఓపెన్ బస్ పరేడ్‌లో అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. 17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన రోహిత్‌సేన.. మూడు రోజుల ఆందోళనతో కూడిన నిరీక్షణను సైతం తెరదించింది. బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌లో అడుగుపెట్టింది. ఐసీసీ ట్రోఫీతో టీమ్ ఇండియా మన గడ్డపై అడుగుపెట్టడంతో అభిమానులు ఆనంద సంద్రంలో మునిగిపోయారు.
నవతెలంగాణ-ముంబయి
భారత్ చివరగా 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఐసీసీ టైటిల్ వేటలో ఎన్నోసార్లు చేరువగా వచ్చినా విజయవంతం కాలేదు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయంతో భారత అభిమానుల ఐసీసీ టైటిల్ దాహం తీర్చింది రోహిత్‌సేన. చారిత్రక విజయం సాధించిన రోహిత్ సేనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ముంబయి వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన విజయోత్సవ సభలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాలు రూ.125 కోట్ల చెక్‌ను భారత క్రికెటర్లను అందజేశారు. భారత క్రికెట్ చరిత్రలో ఇది అత్యధిక నగదు బహుమతి కావటం విశేషం.
ప్రధాని మోడితో భేటీ
తుఫాన్ కారణంగా బార్బడోస్‌లోనే ఉండిపోయిన టీమ్ ఇండియా.. ఎట్టకేలకు గురువారం స్వదేశం చేరుకుంది. భారత క్రికెట్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత క్రికెటర్లు, సహాయక సిబ్బంది, కుటుం సభ్యులు సహా భారత క్రీడా పాత్రికేయులు సైతం గురువారం స్వదేశానికి వచ్చారు. భారత్‌కు వచ్చీ రాగానే రోహిత్ సేన ప్రధాన మంత్రి నరెంద్ర మోడీతో సమావేశం అయ్యింది. జట్టు సభ్యులతో పాటు బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు రోజర్ బిన్ని, జై షాలు ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు. జట్టులోని అందరితో మాట్లాడిన మోడీ.. చీఫ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలతో కలిసి ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందుకున్నాడు. ప్రపంచకప్ విజయం సాధించిన టీమ్ ఇండియాకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
జనసంద్రమైన మెరైన్ డ్రైవ్
భారత క్రికెట్ జట్టుకు ముంబయి అఖండ స్వాగతం పలికింది. రోహిత్ సేన ఓపెన్ బస్ పరేడ్‌తో వాంఖడేకు చేరుకోవటంతో.. అభిమానులు ముందుగానే మెరైన్ డ్రైవ్‌ను ముంచెత్తారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియం రోడ్లు పూర్తిగా జనసంద్రం అయ్యాయి. వాంఖడే స్టేడియంలో విజయోత్సవ ర్యాలీ ఉండటంతో అభిమానులతో స్టేడియం సైతం నిండిపోయింది. స్టేడియం బయట మెరైన్ డ్రైవ్ ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి పోయింది. ఆటోగ్రాఫ్ చేసిన టెన్నిస్ బాల్స్‌ను స్టాండ్స్‌లోకి విసిరిన క్రికెటర్లు.. అభిమానులకు మరింత కిక్కు అందించారు.
కోహ్లి, రోహిత్ క్రేజ్
భారత క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఓపెన్ బస్ పరేడ్ జరిగింది. అభిమాన విశ్వవిజేత క్రికెటర్లను చూసేందుకు, విన్నింగ్స్ చీర్స్ కొట్టేందుకు లక్షలాది మంది అభిమానులు మెరైన్ డ్రైవ్‌కు వచ్చారు. ఓపెన్ బస్‌లో కుల్దీప్ యాదవ్ మూడు రంగాల జెండాతో ముందు నిలువగా.. అర్ష్‌దీప్ సింగ్ జాతీయ పతాకం ఊపుతూ కేరింతలు కొట్టాడు. ఓపెన్ బస్ పరేడ్ వాంఖడే స్టేడియంకు చేరుకునే క్రమంలో.. విరాట్ కోహ్లి అభిమానులకు మరుపురాని అనుభూతి అందించాడు. టీ20 ప్రపంచకప్‌తో సందడి చేస్తున్న కోహ్లి.. రోహిత్ శర్మను సైతం పిలిచాడు. హిట్‌మ్యాన్‌తో కలిసి పొట్టి ప్రపంచకప్ టైటిల్‌ను ఎత్తుకోవటంతో… అభిమానులు ఊగిపోయారు.