‘వాస్తవాలు’ చర్చించాలి

– ఆస్ట్రేలియా గ్రీన్స్‌ సెనెటర్‌ జాన్‌
– పార్లమెంటులో మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శన
సిడ్నీ : మానవ హక్కుల విషయంలో వాస్తవాలపై చర్చ అవసరమని ఆస్ట్రేలియా గ్రీన్స్‌ సెనెటర్‌ జోర్డాన్‌ స్టీల్‌ జాన్‌ అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన చర్చల్లో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ దీనిని ప్రస్తావించక పోవడం శోచనీయమని అన్నారు. వాస్తవానికి ఆస్ట్రేలియాలోనూ మానవ హక్కుల పరిరక్షణలో అల్బనీస్‌ కూడా ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. వీరిద్దరి వ్యవహారాన్ని చూస్తుంటే తనకు ‘నిజమైన ఆగ్రహం’ ఏమిటో తెలుస్తోందన్నారు. గుజరాత్‌లో గోద్రా అనంతర నరమేధంలో వేలాది మంది ముస్లింల ఊచకోత కోయబడ్డారు. ఈ మారణహౌమంలో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాత్రను బయటపెడుతూ బిబిసి ఒక డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి విదితమే. ఈ డాక్యుమెంటరినీ భారత ప్రభుత్వం నిషేదించింది. అయితే ఇప్పటికే భారత్‌ సహా పలు ప్రాంతాల్లో మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు ఈ నిషేదాన్ని తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ ఆస్ట్రేలియన ఎంపీలు, వివిధ మానవ హక్కుల సంఘాలు ఆస్ట్రేలియా పార్లమెంటులో బిబిసి డాక్యుమెంటరీని ప్రదర్శించాయి.
వాణిజ్యం, పెట్టుబడులు, వలసల విషయంపై చర్చలు జరిపేందుకు ప్రధాని మోడీ ఆస్ట్రేలియాలో మూడు రోజుల పాటు పర్యటించారు. మంగళవారం నాడు సిడ్నీలో 20 వేల మంది స్థానిక ప్రజానీకంతో మోడీ కోసం అల్బనీస్‌ అట్టహాసంగా ఒక సభను ఏర్పాటు చేశారు. బుధవారం సిడ్నీలోని ఒపెరా హౌస్‌ వద్ద భారత పతకాన్ని ప్రదర్శించి ఇరువురు నేతలు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదే సమయంలో పార్లమెంటు హౌస్‌లో మోడీ ప్రభుత్వం నిషేదించిన బిబిసి డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని 50 మంది ప్రముఖులు వీక్షించారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తదితర భాగస్వామ్యంలో నిర్వహించిన ఈ చిత్ర ప్రదర్శన సందర్భంగా అక్కడకు విచ్చేసిన వారంతా మానవ హక్కుల కోసం నినదించారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల, పత్రికా స్వేచ్ఛ హరించివేస్తున్నతీరుపట్ల మోడీతో చర్చల సందర్భంగా అల్బనీస్‌ నిలదీయాల్సిందని వారు అభిప్రాయపడ్డారు.. మానవ హక్కుల విషయంలో పశ్చిమ దేశాలు ఎల్లప్పుడూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూనేవుంటాయని సెనెటర్‌ స్టీల్‌ జాన్‌ విమర్శించారు. జాన్‌ ఇంగ్లండ్‌లో జన్మించారు. తాను జన్మించిన ఇంగ్లండ్‌ భారత్‌లో వ్యవస్థీకృత దోపిడికి పాల్పడిందని, అలాగే ఆస్ట్రేలియాలో ఆదివాసీలపైన దాడులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. మోడీపై బిబిసి డాక్యుమెంటరీ వీక్షణకు 50 మంది మాత్రమే హాజరయ్యారన్న అసంతృప్తి తనకు లేదని, అంతకుమించి ఈ విషయంలో మోడీతో చర్చలేకుండా విఫలమైన అల్బనీస్‌ వైఖరిపైనే తనకు నిజమైన ఆగ్రహం ఉందని జాన్‌ పేర్కొన్నారు. భారత్‌తో సత్సబంధాల బలోపేతానికి తామెంతో గౌరవమిస్తామని, అయితే భారత్‌లో మానవ హక్కుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. అయితే ఆస్ట్రేలియాలోనూ మానవ హక్కుల పరిస్థితి భారత్‌ను మించిపోయేంత గొప్పగా ఏమీ లేవని పేర్కొన్నారు. అందువల్ల మనమంతా నిజాలు మాట్లాడుకోవాల్సివుందన్నారు. అలాగే నిజాలు నిర్బయంగా మాట్లాడటం కూడా నేర్చుకోవాలన్నారు. భారత దేశంలో ముస్లింలు, ఇతర మైనార్టీలు తీవ్రమైన వివక్షకు గురౌతున్నారని, రాజకీయ నాయకులు వారిపై తీవ్ర అణిచివేత కొనసాగిస్తున్నారని, వీటన్నింటికి బిబిసి డాక్యుమెంటరీ దర్పణం పట్టిందని ఆయన తెలిపారు.
అధికారిక గణాంకాల ప్రకారమే గుజరాత్‌ నరమేధంలో రెండు వేల మందికిపైగా ముస్లింలు హత్యకు గురయ్యారని ఆయన వాపోయారు. మూడు నెలల పాటు నిర్విరామంగా మారణకాండ కొనసాగినా అప్పటి పాలకులు మొద్దు నిద్దర నటించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంత జరిగినా ఈ మత ఘర్షణల్లో మోడీ ప్రమేయానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇచ్చిందన్నారు. అయితే మోడీకి ప్రత్యక్ష ప్రమేయముందన్న విషయాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం రూపొందించిన నివేదిక బట్టబయలు చేసిందని, ఇదే విషయాన్ని బిబిసి డాక్యమెంటరీలో కూడా పేర్కొన్నారని సెనెటర్‌ జాన్‌ తెలిపారు. ముస్లిం మహిళలపై వ్యవస్థీకృతంగా అత్యాచారాలకు పాల్పడటం మొదలుకొని అన్ని నైతిక ప్రామాణికాలకు తిలోదకాలు ఇచ్చేసి యథేశ్చగా హింసాకాండ సాగించేందుకు నాటి బిజెపి ప్రభుత్వమే కారణమని బ్రిటన్‌ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. ‘హిందువులు ఆగ్రహంతో ఉన్నారు. ఏమి జరిగినా మీరు జోక్యం చేసుకోవద్దు’ అంటూ పోలీసులకు మోడీనే స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు బ్రిటీష్‌ అధికారులను ఉటంకిస్తూ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. వలస వాద మైండ్‌సెట్‌తో ఈ డాక్యుమెంటరినీ బిబిసి రూపొందించిందని ఆరోపించిన మోడీ సర్కార్‌ భారత్‌లో ప్రదర్శనపై నిషేదం విధించింది. అంతేకాదు ఈ డాక్యుమెంటరీ వెలుగులోకి వచ్చిన వెనువెంటనే న్యూఢిల్లీలోని బిబిసి కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత సోదాలు కూడా జరిపించి వేధింపులకు గురి చేసిన సంగతి విదితమే.