సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుపై ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు..

నవతెలంగాణ హైదరాబాద్: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి మూడేండ్లు అవుతున్నా ఆయన మరణంపై నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. సుశాంత్‌ మరణంపై అనేక అనుమానాలున్న నేపధ్యంలో కేసును సీబీఐకి అప్పగించారు. మూడేండ్లు అయినా సీబీఐ దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల విచారణలో పలు కీలక సాక్ష్యాలను సేకరించినట్టుగా తెలిపారు. ‘ సుశాంత్‌ కేసులో తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కొంతమంది చెప్పారు. వాళ్లను సంప్రదించి తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను పోలీసులకు ఇవ్వాలని కోరాం’ అని దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. వారి దగ్గర నుంచి ప్రాథమిక ఆధారాలు సేకరించామని చెప్పారు. అయితే సాక్ష్యులు చెప్పిన విషయాల్లోని నిజానిజాలను అధికారులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. సుశాంత్‌ మరణంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ దశలో ఈ కేసు గురించి ఇంకా ఏమీ చెప్పలేమని ఫడ్నవీస్‌ తెలిపారు.

 

Spread the love