బాధ్యతల్లో విఫలమైన ఇ.సి

బాధ్యతల్లో విఫలమైన ఇ.సి(మే 8 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)
లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌ మే ఏడవ తేదీన పూర్తవడంతో సగం లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగినట్టయింది. స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు నిర్వహించడంలో, పర్యవేక్షిం చడంలో ఎన్నికల సంఘం (ఇ.సి) ఏ మేరకు పని చేయగలిగిందని అంచనా వేసేందుకు ఒక అవకాశం లభించినట్టయింది. అందుకు అవస రమైన అనుభవం సమకూరింది. ఈ విధమైన మదింపు వేసినప్పుడు ఇవ్వగలిగే తీర్పు ఒక్కటే. ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు కేవలం మూడు రోజుల ముందు నియమితులైన ఇద్దరు కమిషనర్లను కలిగిన ఎన్నికల సంఘం పని గురించి వ్యక్తమైన భయాలన్నీ నిజమైనాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసిసి అమలు చేయడమనే ప్రాథమిక బాధ్యతను) కూడా ఇ.సి నిర్వహించలేదు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కలిగించలేకపోయింది. మార్చి 16న ఎన్నికల ప్రక్రియ ప్రకటించిన నాటి నుంచి ఎంసిసిని అమలు పర్చగలిగామని ఇసి ఆత్మసంతృ ప్తితో కూడిన ప్రకటన చేసింది. కానీ వాస్తవానికి ఈ కాలంలో ఇసి తన బాధ్యతల నుంచి కాడి పారేసింది. మొదటి విషయం ప్రతిపక్షాలతో రాజ్యప్రేరిత నిర్బంధం సాగుతుంటే ఇ.సి నిశ్శబ్ద ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఎన్నికల ప్రకటన, కోడ్‌ అమలులోకి వచ్చిన అయిదు రోజుల తర్వాత మార్చి 21న ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు జరిగింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల నాయకు లపై ఎలాంటి బలప్రయోగ చర్యలకు పాల్పడవద్దని ఇ.సి అన్ని కేంద్ర ఏజన్సీలకు సూచన చేసి వుండవలసింది. కానీ అలా జరగలేదు. అలాగే ఆదాయ పన్ను శాఖ తొలుత కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేసింది. ఆ తర్వాత త్రిసూర్‌ జిల్లా సీపీఐ(ఎం) బ్యాంకు ఖాతాను కూడా స్తంభింపచేసింది. ఇది ఎన్నికల తరుణంలో సంబంధిత పార్టీలకు నిధులు లేకుండా బిగించేందుకు ఉద్దేశించిన చర్య మాత్రమే.
విద్వేష ప్రచారాలకు యథేచ్ఛ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చి మతతత్వ ధోరణిలో చేసిన ప్రసంగాలపై చర్య తీసుకోవడానికి ఇ.సి నిరాకరించింది. ఎంసిసి అమలులో లొసుగులకు ఇంతకన్నా బలమైన నిదర్శనం అక్కరలేదు. ప్రతిపక్షాలు రామచంద్ర మూర్తికి వ్యతిరేకంగా వున్నాయని, అవమానించేవిగా వున్నాయని ఆయన ఆరోపించారు. రామ మంది రంపై విద్వేషం పెంచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఏప్రిల్‌ ఆరున అజ్మీర్‌ లోనూ, 9న ఫలిబిత్‌లోనూ మోడీ చేసిన ప్రసంగాలపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత దశలో ముస్లింలను భూతాల్లా చిత్రిస్తూ ఏప్రిల్‌ 21న బాన్స్‌వారాలో మూఢత్వ ప్రసంగం చేశారు. దీనిపైనా ఆందోళన చెందిన పౌరులు, వివిధ పార్టీలు ఫిర్యాదులు చేశాయి. ఈ విధంగా ప్రసంగించిన వారిపై చర్య తీసుకునేందుకు ఇ.సి సిద్ధం కాలేదు. అందుకు మారుగా బీజేపీ అధ్యక్షుడైన జె.పి నడ్డాకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాలు గడిచిపోయినా ఇప్పటివరకూ బీజేపీ అధ్యక్షుడి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. కేవలం మరింత గడువు కావాలని మాత్రమే ఆయన కోరారు. మరోవైపున మోడీ మతపరమైన ఇతివృత్తాలతో నిరంతరాయంగా రెచ్చిపోతున్నారు. ప్రతి పక్షాలపై ఉద్రేకాలు రెచ్చగొట్టే ప్రసంగాల పరంపరగా సాగిస్తున్నారు. తాజా ఉదాహరణ చెప్పాలంటే కర్నాటక బీజేపీ అధ్యక్షుడు ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు ఎక్స్‌ ప్లాట్‌ఫాంలో పోస్టు చేశారు. దానిపై ఫిర్యాదులు వచ్చాక ఎన్నికల కమిషన్‌ ఎక్స్‌ప్లాట్‌ఫాంను ఆ వీడియోలు తొలగించాలని ఆదేశించింది. అయితే కర్నాటక ఎన్నికల చివరి దశ పూర్తయిన తర్వాత గాని ఆ మేరకు ఆదేశాలు జారీ కాలేదు. ఇప్పటికీ వాటిని తొలగించిందీ లేదు. వ్యక్తిగతంగా అభ్యర్థులపై దాడులు, తప్పుడు ఆరోపణలు వంటి వాటి విషయంలో మాత్రం ఎన్నికల కమిషన్‌ వెంటనే చర్య తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కానీ విద్వేష ప్రసంగాలు, మత విభజనను పెంచేందుకోసం సాగుతున్న హిందూత్వ ప్రచారాల విషయంలో మాత్రం ఎలాంటి చర్య తీసుకోవాలనుకోవడం లేదనిపిస్తుంది.
సమర్థత, సాంకేతికత మాయం
కమిషన్‌ సమర్థతలోనూ సాంకేతిక పాటవంలోనూ క్షీణత కొట్లవచ్చినట్టు కనిపిస్తుంది. ఒక దశాబ్దం కిందటి వరకూ ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ నిర్వహణలోనూ యంత్రాంగ సంబంధమైన చర్యలలోనూ చక్కగా పని చేసిన దాఖలాలున్నాయి. అలాగే గణాంకాలు కూడా వెంటవెంటనే కూర్పు జరిగేది. కాని గత కొన్ని సంవత్సరాలలోనూ నికరమైన ఈ గత ప్రతిష్ట హరించుకుపోతున్నది. 2019 ఎన్నికల తర్వాత పోలింగుకు సంబంధించి రాష్ట్రాల వారీగానూ దేశ వ్యాపితంగానూ కచ్చితమైన తుది గణాంకాల ప్రకటనకు రెండేండ్లు పట్టింది. ఇప్పుడు కూడా పోలింగ్‌ మొదటి దశ పోలింగ్‌ తుది గణాంకాల ప్రకటన రెండవ దశ తర్వాత నాలుగు రోజులకు గాని జరగలేదు. రెండవ దశ పోలింగ్‌ శాతం తుది వివరాలు కూడా నాలుగు రోజులు ఆలస్యంగా ప్రకటితమైనాయి. దాదాపు ఆరు శాతం పెరుగుదల ఉన్నట్టు వెల్లడించారు. అసాధారణమైన ఈ పెరుగుదలకు కారణమేంటో ఎన్నికల సంఘం వివరణ కూడా ఇచ్చింది లేదు. పైగా నియోజకవర్గాలలో గాని అఖిల భారత స్థాయిలో గాని పోలైన ఓట్ల సంఖ్య ఎంతో చెప్పలేదు. ఈ సంఖ్యలు కచ్చితంగా ఎన్నికల కమిషన్‌కు అందుబాటులో వుండి వుండాలి. అవి వుంటేనే శాతం లెక్కకట్టడం సాధ్యపడుతుంది. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఈ సంఖ్యలతో సరిపోల్చవలసి వుంటుంది. ఈ డేటా ఇవ్వలేకపోవడానికి ఎలాంటి కారణాన్ని కమిషన్‌ వివరణ ఇవ్వడం లేదు
సుప్రీంకోర్టు చేయాల్సింది
అధికార వర్గం లేదా పాలక పార్టీ ఒత్తిళ్లను తట్టుకోలేని, దుర్బలమైన ఎన్నికల కమిషన్‌ ‘ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ, నిర్దేశం, నియంత్రణ’ అనే తన తన రాజ్యాంగ బాధ్యతలను ఎన్నటికీ నిర్వహించజాలదు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కమిషనర్‌గా పని చేసిన అశోక్‌ లావాసా విషయంలో జరిగినదాని నీడలు ప్రస్తుత కమిషనర్లను వెంటాడుతుండాలి. ఇ.సి అనేది న్యాయమైన స్వేచ్ఛాయుత ఎన్నికలకు భద్రత కల్పించాల్సిన ఒక బఅహత్తర కీలక వ్యవస్థ. ఈ ఎన్నికల తర్వాతనైనా కమిషన్‌ స్వతంత్రతను, సమగ్రతను పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలసి వుంటుంది. మోడీ ప్రభుత్వం 2023లో తెచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించడం ఆ దిశలో తొలి అడుగవాలి. ఇందుకు ఒక భిన్న ప్రక్రియ అవసరమని సూచించిన సుప్రీంకోర్టు ఈ విషయంలో కాలూని ఆ పని జరిగేలా చూడాల్సి వుంటుంది.

Spread the love