న్యాయమైన

బహుళ ధ్రువ ప్రపంచం సాధ్యమే : పుతిన్‌
మాస్కో : దోపిడీపై ఆధారపడిన నయావలసవాదానికి కాలం చెల్లిందని, న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచం సాధ్యమేనని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఉద్ఘాటించారు. రష్యా, దాని అంతర్జాతీయ భాగస్వాములు కలసి ఈ లక్ష్య సాధనకు కృషి చేస్తాయని అన్నారు. ఉమ్మడి బెదిరింపులు, సవాళ్లను ఎదుర్కోడానికి భావ సారూప్యత కలిగిన అన్ని దేశాలతో సహకరించడానికి రష్యా సిద్ధంగా ఉందన్నారు. భద్రతా సమస్యలపై బుధవారం నాడిక్కడ జరిగిన 11వ అంతర్జాతీయ ఉన్నత ప్రతినిధుల సదస్సునుద్దేశించి పుతిన్‌ వీడియో ప్రసంగం చేస్తూ,’ మనందరం కలిసి మరింత న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచాన్ని ఏర్పరచుకుందాం. ప్రపంచ వనరుల లూటీకి దోహదం చేస్తున్న నయా వలసవాద వ్యవస్థను అంతమొందిద్దాం’ అని అన్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మకమైన మైత్రి, సహకారం ఎంతో విలువైనది. దీనిని మరింత బలోపేతం చేద్దాం’ అని ఆయన అన్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో సైనిక జోక్యాలకు దిగుతోందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ అశాంతికి, అస్థిరతకు అమెరికా విధానాలే కారణమని పుతిన్‌ దుయ్యబట్టారు. రష్యా సారథ్యంలో జరిగిన ఈ భద్రతా సదస్సుకు వివిధ దేశాల నుంచి వంద మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఆహారం, సమాచార భద్రత,మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో సహకారంపై మరింత శ్రద్ధ పెడతామని నిర్వాహకులు తెలిపారు.

Spread the love