– గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లోకి..
– వివిధ రకాల కంపెనీల పేర్లతో విక్రయాలు
– ధర తక్కువ.. అధిక దిగుబడి పేరుతో అంటగడుతున్న వైనం
– ఆలస్యంగా మేల్కొన్న అధికార యంత్రాంగం
– టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు.. విస్తృత తనిఖీలు
అనేక ఆశలతో ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమైన అన్నదాతలకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. బలమైన విత్తనాలు నాటితేనే పంట దిగుబడి వస్తుంది. కానీ నకిలీ విత్తనాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రైతులకు ఆశచూపి టార్గెట్‌గా చేసుకుని అక్రమార్కులు ఆటలు మొదలెట్టారు. ప్రతి సీజన్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు సరఫరా చేస్తూ అన్నదాతలకు అంటగడుతున్నారు. వివిధ రకాల కంపెనీల పేర్లతో స్థానిక డీలర్ల ద్వారా మారుమూల ప్రాంతాల రైతులకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరతోపాటు అధిక దిగుబడి వస్తుందని నమ్మబలుకుతూ విక్రయిస్తున్నారు. ఏవి మంచివో, ఏవి చెడ్డవో తెలియక నమ్మకం మీద రైతులు విత్తనాలను కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. కొందరు ఏండ్లుగా ఈ దందాను కొనసాగిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ తంతంగం కొనసాగుతూనే ఉంది. అరెస్టులు, జరిమానాలు జరుగుతున్నా అవి ఏమాత్రం నకిలీ విత్తనాల అమ్మకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కఠిన చర్యలు (పీడీ యాక్ట్) తీసుకుంటామని గత ప్రభుత్వం హెచ్చరికలు చేసినా.. ఎవరి మీదా తీసుకోలేదు. తూతూమంత్రంగానే ముగిశాయి. దీంతో నకిలీ విత్తనాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో రూ.19.39లక్షల విలువ చేసే నకిలీ విత్తన ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఎక్కడో ఒక చోట పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో రూ.36లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలనూ రాయితీపై అందజేయబోతున్నట్టు తెలియజేశారు. జిలుగు, జనుము, పిల్లిపెసర, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు మోసపోవద్దని సూచించారు. గతేడాదికంటే ఈసారి అదనంగా 15.75 లక్షల క్వింటాళ్ల పత్తి విత్తనాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం విస్తృత తనిఖీలకు రంగం సిద్ధం చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమాయక రైతులే లక్ష్యంగా నకిలీ విత్తన ముఠాలు చెలరేగిపోతున్నాయి. వర్షాలు రాగానే.. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి విత్తుతున్న రైతులకు ఆదిలోనే అవరోధాలు ఏర్పడుతున్నాయి. విత్తనం మొలకెత్తకపోవడం.. ఒకవేళ మొలకెత్తినా కాత, పూత లేకపోవడం.. దిగుబడి రాకపోవడంతో పంట చేతికొచ్చే సమయంలో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఇలాంటి వాటిని ముందస్తుగానే నివారించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో రైతులు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మూడేండ్ల నుంచి వరుసగా తనిఖీలు చేస్తున్న టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందల క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తన సంచులను స్వాధీనం చేసుకున్న సందర్భాలున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం మరో ఇరవై రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా.. వారం రోజుల కిందటే టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే నకిలీ విత్తనాలు చేరాల్సిన చోటకు చేరిపోయాయనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క వివిధ దుకాణాల్లో నకిలీ విత్తనాలు పట్టుకుంటున్న అధికార యంత్రాంగం కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు తప్పితే వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది.
కంపెనీల పేరిట విక్రయాలు..!
ప్రతి ఏటా ఈ నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. ఆంధ్రా, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు నకిలీ విత్తనాల సంచులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చేరవేస్తున్నారు. జిల్లాకు చెందిన కొందరు విత్తన డీలర్లను మచ్చిక చేసుకొని దందాను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. వేసవి ప్రారంభంలోనే జిల్లాలోకి తీసుకొచ్చి రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచుతున్నారు. పెద్ద మొత్తంలో సంచుల్లో తీసుకొచ్చి వాటిని వివిధ కంపెనీల పేరిట ఆకర్షణీయమైన బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి ఆయా దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. ఈ నకిలీ విత్తనాల వ్యవహారం కొందరు అధికారులకు తెలిసినా లోపాయికారి ఒప్పందం మేరకు మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా మీనాక్షి, పుడమి కంపెనీల పేరిట లూజ్ విత్తనాలను పెద్ద మొత్తంలో తీసుకొచ్చి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో నింపి విక్రయాలు చేపడుతున్నారు. ఈ కంపెనీలకు చెందిన విత్తనాలు ఇక్కడ విక్రయించేందుకు అనుమతి లేకపోయినా స్థానిక కొందరు డీలర్ల సాయంతో విక్రయాలు చేపడుతున్నట్టు తెలిసింది. మూడేండ్ల కిందట జిల్లా కేంద్రంలోని ఓ విత్తన దుకాణంలో తనిఖీలు చేపట్టిన అధికారులకు నకిలీ విత్తనాలు లభించినా కేవలం కేసు నమోదుతోనే సరిపెట్టినట్టు తెలుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. లేదంటే ఎక్కడో చోట నకిలీ విత్తనాలు బయటపడితేనే తనిఖీలు చేపడుతున్నారనే వాదన వినిపిస్తోంది. స్వతహాగా తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.
తనిఖీలు చేపడుతున్నాం
ఉన్నతాధికారుల ఆదేశం మేరకు నకిలీ విత్తనాలు గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. తాజాగా రూ.29.35లక్షల విలువైన విత్తనాలు పట్టుకున్నాం. వివిధ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు పర్యటిస్తూ తనిఖీలు చేపడుతున్నాయి. నకిలీ విత్తనాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటాం.
పుల్లయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, ఆదిలాబాద్