ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు జూనియర్‌ మెహమూద్‌ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 67 ఏళ్లు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మెహమూద్‌ అసలు పేరు నయీమ్ సయ్యద్. అయితే బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు మెహమూద్‌ని తలపించేలా యాక్టింగ్ చేస్తుండటంతో ఆయన్ని అంతా జూనియర్ మెహమూద్‌గా పిలుస్తుంటారు. జూనియర్‌ మెహమూద్‌ కొన్ని రోజుల క్రితం స్టమక్ క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం అది 4వ స్టేజ్‌లో ఉందన్న విషయం ఆయనకు నెల రోజుల క్రితం వైద్యుల ద్వారా తెలిసింది. ఆయన ఎక్కువ రోజులు బతకరని వైద్యులు కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరణించారు. ఇక నటుడి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెహమూద్‌ సినిమాల విషయానికొస్తే.. 250కిపైగా చిత్రాల్లో నటించారు. మేరా నామ్ జోకర్, పర్వరిష్, కతి పతంగ్, దోఔర్ దో పాంచ్, మాఫియా, బాప్ నంబ్రి-బేటా దస్ నంబ్రీ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Spread the love