మతోన్మాదం, కార్పొరేట్‌ దోపిడీకి వ్యతిరేకంగా..

Against bigotry and corporate exploitation.– పోరాడటమే సాయుధ పోరాట అమరులకు నిజమైన నివాళి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
మతోన్మాదం, కార్పొరేట్‌ సంస్థలు కలిసి ప్రజలపై చేస్తున్న దాడులను ఎదుర్కోవాలని, వారికి వ్యతిరేకంగా పోరాడటమే సాయుధ పోరాట అమరులకు మనమిచ్చే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పక్షోత్సవాల సందర్భంగా సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాలిబండ చౌరస్తా నుంచి చార్మినార్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చార్మినార్‌ వద్ద బహదూర్‌పురా జోన్‌ కార్యదర్శి అబ్దుల్‌ సత్తార్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో అబ్బాస్‌ మాట్లాడారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని తెలిపారు. ఆనాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని.. బీజేపీ ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్రభాష్యాలు చెప్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని కోరారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన ఈ మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమురయ్య, షేక్‌ బందగీ, ఠాన్‌ నాయక్‌, షోయబుల్లాఖాన్‌, మగ్దూం మోహియుద్దీన్‌, జవ్వాద్‌ రజ్వీ, ఆలం ఖుందుమీరి, షౌకత్‌ ఉస్మాని లాంటి ఎందరో వీరులు అసువులు బాసారని గుర్తుచేశారు. వీళ్లంతా కులమతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణిచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, సుందరయ్యతో పాటు మగ్దూం మొహియుద్దీన్‌ ఉన్న విషయాన్ని మర్చిపోకూడదని అన్నారు. అలాంటప్పుడు హిందూ, ముస్లింల మధ్య పోరాటం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజలను పట్టిపీడించి వెట్టిచాకిరి చేయించుకున్న వారిలో విసునూరు రాంచంద్రారెడ్డి, జన్నారం ప్రతాపరెడ్డి లాంటి హిందువులైన జమీందారులు, జాగిర్దారులు, దొరలు, దేశ్‌ ముఖ్‌లు, భూస్వాములు, పటేల్‌, పట్వారీలే మెజారిటీగా ఉన్నారని తెలిపారు. వీరి ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కుల, మతాలకతీతంగా ఐక్యంగా సాగించిన పోరాటాన్ని మతం పేరుతో ఎలా వక్రీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇది ప్రజల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిదానం చేసిన రైతాంగ సాయుధ పోరాట అమరుల త్యాగాలను కించపరచడమేనని అన్నారు. ప్రజలు వాస్తవ చరిత్రను తెలుసుకోవాలన్నారు. అమరులను గుర్తు చేసుకోవడం అంటే.. మతోన్మాదుల ఆగడాలకు, కార్పొరేట్‌ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే నేడు మన ముందున్న కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.విఠల్‌, ఎం. మీనా, పి.నాగేశ్వర్‌, ఎల్‌. కోటయ్య, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మమ్మ, ఎం. బాలునాయక్‌, ఎం. శ్రావణ్‌ కుమార్‌, జంగయ్య, శశికళ, కిషన్‌ నాయక్‌, బాబర్‌ ఖాన్‌, కృష్ణ నాయక్‌, రామ్‌ కుమార్‌, జోన్‌ కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.న

Spread the love