అప్పుల బాధ తాళలేక.. రైతు ఆత్మహత్య

నవతెలంగాణ-రేగొండ
అప్పుల బాధ తాళలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం తండాకు చెందిన బాదావత్‌ వీర్య(50) తన రెండెకరాల భూమితో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేస్తున్నాడు. రెండు సంవత్సరాల నుంచి పంటలు సరిగ్గా పండకపోవడంతో సాగు తీసుకొచ్చిన పెట్టుబడి అప్పు పెరిగిపోయింది. దీంతో అప్పు ఎలా తీర్చాలని మనస్తాపానికి గురయ్యాడు. అలాగే చిన్న కూతురు పెండ్లి కుదరడంతో మళ్లీ అప్పు ఎక్కడ తేవాలని ఆందోళన చెందాడు. ఈ క్రమంలో ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని పరకాల ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. రైతు కొడుకు బాధావత్‌ వినోద్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రేగొండ ఎస్‌ఐ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు.

Spread the love