విద్యుత్‌ షాక్‌తో రైతు దంపతులు మృతి..

నవతెలంగాణ – సంగారెడ్డి: పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో రైతుదంపతులిద్దరు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరా సంఘ మండలంలోని బిడకన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మరియమ్మ ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద పనులు చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో యవసాయ బోరు వద్ద ఉన్న ఫెన్సింగ్ కరెంటు రావడంతో మరియమ్మ కరెంటు షాక్‌ తగిలి అక్కడేపడిపోయింది. ఆ తర్వాత ఆమె భర్త దేవిదాస్‌ (35) పొలం వద్దకు వచ్చాడు. భార్య మరియమ్మ కిందపడి ఉండడం చూసి.. ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనికి విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది. రైతు దంపతులకు కొడుకు మనోజ్ (14), మానస (11) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love