– మార్కెట్లోకి కలర్ఫుల్ ప్యాకెట్లలో ఫేక్ సీడ్ ఎంట్రీ
– ‘తక్కువ ధర.. ఎక్కువ దిగుబడి’ అంటూ బురిడీ కొట్టించేందుకు రెడీ
– నకిలీ విత్తనంపై వ్యవసాయ, పోలీసుశాఖల నజర్
– ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలతో తనిఖీలకు ఆదేశాలు
– ఇప్పటికే పలు దుకాణాల్లో సోదాలు, రికార్డుల పరిశీలన
– ఏటా కొత్తదారుల్లో విక్రయాలు
– దుకాణదారులు, డీలర్లకు 50శాతానికిపైగా కమీషన్లు
– జిల్లా కేంద్రాలు, శివారు ప్రాంతాల గోడౌన్లలోనే నిల్వ?
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / కరీంనగర్
మరో వారం రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే రైతులు దుక్కులు దున్నే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతియేడూ లాగానే ఈసారీ నకిలీ విత్తనాలు మార్కెట్లోకి దూరాయి. కలర్ఫుల్ కరపత్రాలు, విత్తనాలు నింపిన ప్యాకెట్లను గుట్టుగా కేటుగాళ్లు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ‘తక్కువ ధర.. దిగుబడి ఎక్కువ’ అంటూ డీలర్లు, దుకాణదారులతో బురిడీ కొట్టించి సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. మార్కెట్లో పేరుమోసిన విత్తన కంపెనీల మాదిరిగానే ప్యాకెట్లపై వివరాలు ముద్రించి, అందులో స్వల్ప మార్పులు చేసి అధిక కమీషన్లకు దుకాణదారులకు ఇచ్చి విక్రయిస్తున్నారు. ఈ విక్రయదారులు వ్యవసాయ, పోలీసు శాఖల కంటపడకుండా వ్యాపార మార్గాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నారు. అలాగే, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
కోట్ల రూపాయల వ్యాపారం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదేండ్ల కిందటి వరకూ వరి పంటకు మూడింతలకుపైగానే పత్తి సాగయ్యేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటి వనరులు పెరగడం, ప్రతియేటా సాధారణానికి మించి వర్షాలు పడటం, ప్రాజెక్టులు, చెరువుల్లో జలకళ సంతరించుకోవడంతో వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. పత్తి సాగు కొద్దిపాటి విస్తీర్ణానికే పరిమితమవుతూ వస్తోంది. మూడేండ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి 2లక్షల ఎకరాలకు మించి సాగవడం లేదు. ఈ వానాకాలంలో కూడా సుమారు లక్షా 88వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా. అందులోనూ కరీంనగర్ జిల్లాలో 50వేల ఎకరాలకు మించి సాగవ్వని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న 80వేల ఎకరాల్లో సాగవ్వనుంది.
ఎకరాకు 800 గ్రాముల నుంచి కిలో పత్తి విత్తనాలు అవసరం పడుతాయి. ఒక్కో ప్యాకెట్ (450 గ్రాములు) రూ.800 వరకు పలుకుతోంది. కొన్ని బ్రాండెడ్ కంపెనీలవి అయితే రూ.వెయ్యి నుంచి రూ.1100 వరకు ఉంది. అయినప్పటికీ ఎకరాకు రెండు ప్యాకెట్ల చొప్పున వినినియోగించినా లక్షా 80వేల ఎకరాలకు సుమారు రూ.30కోట్ల వ్యాపారం సాగుతుంది. ఇక వరి విషయానికొస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా. వరి సహా మొక్కజొన్న, ఇతర పంటలు కలుపుకుని సుమారు రూ.వంద కోట్లకుపైగా విత్తన వ్యాపారం సాగుతుంది. ఈ క్రమంలో ఇందులో సుమారు 30శాతానికిపైగా నకిలీ విత్తన వ్యాపారాలు సొమ్ము చేసుకుంటున్నారని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
”రాజకీయుల”ల అండదండలతోనే..
కొంత మంది అధికారులతోపాటు రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతోనే రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రేతల వ్యాపారానికి మార్గం సుగుమం అవుతోంది. ఏటా ఎన్ని తనిఖీబృందాలు ఏర్పాటు చేసినా, ప్రత్యేక నిఘా బృందాన్ని నియమించినా కొత్తమార్గాల్లో రైతులకు చాటుగా విక్రయిస్తూనే ఉన్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కిందిస్థాయి సిబ్బంది ‘మామూళ్ల’ తనిఖీలూ ఫేక్ సీడ్ విక్రయాలకు కారణమవుతున్నాయి.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
పంటల సీజన్ మొదలవ్వడంతో రైతులు విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దు. ప్యాకెట్లో ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ప్యాకెట్ పంట కాలం పూర్తయ్యేవరకు భద్రపరచాలి. నష్టం వచ్చిందని భావిస్తే విత్తన ప్యాకెట్లోని వివరాలతో వాటిని పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది. నకిలీ విత్తనాలకు సంబంధించి ఇప్పటికే రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– వి.శ్రీధర్, కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి
పీడియాక్ట్ నమోదు చేస్తాం..
నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే కమిషనరేట్ వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. నకిలీ విత్తనాల విక్రయ సమాచారాన్ని స్థానిక పోలీసులకుగానీ, టాస్క్ఫోర్స్ ఏసీపీ (ఫోన్ నంబర్ 87126 70760), ఇన్స్పెక్టర్ (ఫోన్ నంబర్ 87126 70708)కుగానీ సమాచారం అందించాలి. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడియాక్ట్లు నమోదు చేస్తాం. సమాచారం అందించే వారికి నగదు పారితోషికం అందిస్తాం. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బారాయుడు
విత్తనాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– వ్యవసాయశాఖ అనుమతులు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
– సంచులపైనా, ప్యాకెట్లపైనా క్యూర్కోడ్, కంపెనీ పేరు, ప్యాకింగ్ తేదీ, లేబుల్, విత్తనాల మొలక శాతంలాంటి వివరాలు సరి చూసుకోవాలి. తప్పనిసరిగా విత్తనాలకు రసీదు తీసుకోవాలి.
– క్యూర్కోడ్ ఉన్న ప్యాకెట్లను స్మార్ట్ఫోన్లలో గూగుల్లెన్స్ ద్వారా స్కాన్ చేసి ఆ విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ధ్రువీకరించుకోవాలి.
రైతులూ.. బీ అలర్ట్
2:13 am