– మద్దతుధర సహ పలు డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన
– జమ్మూ-ఢిల్లీ జాతీయ రహహర్యానాలో రైతన్న ఆగ్రహం
కురుక్షేత్ర : హర్యానా అన్నదాత ఆందోళన బాట పట్టారు. బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా ఉద్యమించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మండుటెండల్లో రహదారిపై భారీ సంఖ్యలో బైటాయించారు. మంగళవారం ఉదయం కురుక్షేత్ర జిల్లాలోని షాహాబాద్ సమీపంలో ఢిల్లీ – చండీగఢ్ జాతీయ రహదారి 44ను దిగ్భందించారు. ఇటీవల పొద్దుతిరుగుడు విత్తనాలను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి కొనుగోలు చేయలేమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో రైతులు భారీగా పంట నష్టాన్ని ఎదుర్కొన్నారు. నష్టాలతో కుదేలైన రైతులకు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ నిర్ణయం మరింత ఆగ్రహానికి గురిచేసింది. మే 31 నష్టపరిహారం కింద 67,758 మంది రైతుల ఖాతాల్లో రూ.181 కోట్లు జమ చేసినట్టు ట్విటర్‌లో ప్రకటించారు. రైతు సోదరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానని ట్వీట్ చేశారు. అయితే కేవలం నష్టపరిహారం అందించడంతో పంట నష్టం పూడ్చలేమని, విత్తనాలను ఎంఎస్‌పీకి ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.