తుఫాన్‌తో రైతులు ఆగమాగం

– వరి, పత్తి రైతులకు తీరని నష్టం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రతి సంవత్సరం రైతులు కష్టపడి సాగు చేస్తున్నప్పటికీ పంట చేలు చేతికి అందుతున్న సమయంలో మాయదారి విపత్తుల రెూపంలో ప్రతి ఏడు తీవ్రంగానే నష్ట పోతున్నారు. పంట నష్టం అంటూ పాలకులు అంచనాలు వేస్తున్నప్పటికీ అధికారుల అంచనాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దీంతో దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతు పరిస్థితి ధీనంగా మారిందనే చెప్పవచ్చు. బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండల రైతులు అగమాగం అవుతున్నారు. నేడు, రేపు రెండు రోజుల పాటు అతి నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో వరి, పత్తి సాగు చేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలకు మండల రైతులు అదునుగా వరి నాట్లు వేయడంతో పాటు ఎక్కువ మొత్తం పత్తి పంట వేశారు. వరి చేలు పొట్ట దశతో పాటు పత్తి చేలు పూత కాత కాస్తున్న సమయంలో వర్షాలు మొఖం చాటేశాయి. దీంతో రైతులు పంట చేలకు సాగు నీరు అందించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.
రైతులను వెంటాడుతున్న తుఫాన్‌
మండల రైతులను ఈ ఏడాది తుపాన్‌ వెంటాడుతుందనే చెప్పవచ్చు. గత పది రోజుల క్రితం తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షం కురవడంతో వరి చేలు చాలా చోట్ల నేల వాలాయి. తీయడానికి సిద్దంగా ఉన్న పత్తి తడిసి ముద్దయి నల్లబారి పోయింది. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో మరోసారి తుఫాన్‌ కమ్మేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క రైతులు కోత యంత్రాల సహాయంతో కోతలు కోస్తూ ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
తుఫాన్‌ ప్రభావంతో మబ్బులు కమ్ముకోవడంతో కల్లాలలో ఆరబోసిన ధాన్యాన్ని రాశులు పోసి వాటికి బరకాలు కప్పి దాన్యం తడవకుండా కాపాడుకోవడం కోసం మండల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
రైతులకు తీరని నష్టం
తుఫాన్‌ ప్రభావం వలన వరి, పత్తి రైతులు తీవ్రంగా నష్ట పోయారనే చెప్పవచ్చు. ఈ ఏడాది రైతులు అదునుగా ఎక్కువ మొత్తంలో పత్తి సాగు చేసినప్పటికీ దిగుబడి లేక పెట్టిన పెట్టుబడి వచ్చే దారి లేదని ఆందోళన చెందుతున్నారు. మూలిగే నక్క మీద టెంకాయ పడ్డట్లు తుఫాన్‌ రూపంలో కురుస్తున్న వర్షాలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఏది ఎమైనా తుఫాన్‌ ప్రభావంతో వరి పత్తి రైతులు తీవ్రంగా నష్ట పోయారనే చెప్పవచ్చు.

Spread the love