రైతులూ కార్మికులకు అండగా ఎర్రజెండా

Farmers are also workers
A red flag– గులాబీ పాలనలో పేదలకు అన్యాయం
– సంపదనంతా కార్పొరేట్లకు దోచిపెట్టిన ప్రభుత్వం
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ
– సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-యాచారం
పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు, రేషన్‌కార్డులు, ఇంటి స్థలాలు.. తదితర హామీలను అమలుచేయలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ విమర్శించారు. రైతులకు, కార్మికులకు అండగా నిలిచేది ఎర్రజెండా మాత్రమేనని స్పష్టం చేశారు. గులాబీ పాలనలో పేదలకు అన్యాయం జరిగిందన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని గ్రామాల్లో ఆయన సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం అభ్యర్థి పగడాల యాదయ్య తరపున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేదలను మోసం చేశారని ఆరోపించారు. బూర్జువా పార్టీలు డబ్బు, మద్యం, బిర్యానీ పొట్లాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని చెప్పారు. ఫార్మా పేరుతో రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసిందని, దాన్ని వ్యతిరేకించి ఎదురు తిరిగిన రైతులను జైల్లో పెట్టిందని గుర్తు చేశారు. ఫార్మా పేరుతో గులాబీ ప్రభుత్వం భూ వ్యాపారం చేసిందని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పేదలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు మరోసారి అధికారం కోసం తహతహలాడుతోందని ఆరోపించారు. బీజేపీ అధికారం కోసం ప్రజల మధ్య కుల, మత చిచ్చు పెడుతూ దేశ ఐక్యతను దెబ్బతీస్తున్నదని అన్నారు. ప్రజలంతా ఆలోచించి ఈ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలని, నిత్యం ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పగడాల యాదయ్యను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.భూపాల్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మధుసూదన్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు శోభన్‌, మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ, కమిటీ సభ్యులు పి. అంజయ్య, తావునాయక్‌, ఆలంపల్లి జంగయ్య, చందునాయక్‌, సర్పంచులు మండల బాసయ్య, దంతుక పెద్దయ్య, ఉప సర్పంచ్‌ కావాలి జగన్‌, ఉడుతల జంగయ్య, ముచ్చర్ల లాజర్‌, పీఎన్‌ఎం జిల్లా అధ్యక్షులు ఎంజే వినోద్‌కుమార్‌, నాయకులు ఎమ్మే ఐలయ్య, చంద్రయ్య, విప్లవకుమార్‌ పాల్గొన్నారు.

Spread the love