“నిప్పు.. ముప్పు ” రైతులకేది అవగాహన

– వరి కొయ్యలు కాల్చడంతో పర్యావరణానికి హాని
– సహజ లవణాలు కోల్పోతున్న భూములు
– రైతులకు అవగాహన కల్పనలో అధికారులు విఫలం
– చోద్యం చూస్తున్నా వ్యవసాయాధికారులు
.మండిపడుతున్న రైతు సంఘాల నాయకులు
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
రైతులు వానాకాలం పంట (ఖరీఫ్) సాగుకు సన్నద్ధ మవుతున్నారు. ఇందులో భాగంగా వరి కొయ్యలకు నిప్పంటిస్తున్నారు. వరి కొయ్యలు కాల్చి వేయడం వల్ల భూమిలో ఉండే సహజమైన లవణాలతో పాటు వాన పాములు మరణిస్తున్నాయి. దీంతో వర్మి కంపోస్ట్ మారే భూమి అలాగే ఉండిపోతుంది. పశుసంపద ఉన్న వారు గడ్డిని సేకరిస్తుండగా మిగతా వారు అలాగే పొలంలో వదిలేస్తున్నారు. తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలతో దహనం చేస్తున్నారు. అన్నదాతలకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించకపోవడం మూలంగానే “భూసారానికి ముప్పు” ఏర్పడుతుందనీ రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
కాలం మారినా అవగాహన అంతంతమాత్రమే
సిద్దిపేట జిల్లా ఉమ్మడి దుబ్బాక మండలంలో 30 గ్రామాలకు కలిపి ఒక వ్యవసాయాధికారి,  4 గ్రామాలకు కలిపి క్లస్టర్ పరిధిలో 11 రైతువేదిక నిర్మాణం కాగా… 11 మంది ఏఈవోలు గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.రోజు రోజుకు సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న.. సమాజంలో కాలానికి  అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల దాక కోసేవారు. కోత తరువాత గడ్డిని పశుగ్రాసం కోసం కుప్పలు కుప్పలుగా నిల్వ చేసేవారు. క్రమంగా సాగు విధానంలో అనేక మార్పులు వచ్చాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వాడకం పెరగడం వల్ల పశువుల సంఖ్య తగ్గడంతో పాటు కూలీలకు పని లేకుండా పోతుంది. చేనుల్లో మిషన్ తో వరి కోతలు చేయడంతో కొయ్యలు పెద్దగా మిగిలి పోతున్నాయి. పొలం దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయన్న నెపంతో వరి కొయ్యలతో పాటు గడ్డిని సైతం పొలంలోనే కాలుస్తున్నారు.. దీంతో భూమిలో సహజ సిద్ధంగా ఉండే నత్రజని, ఫాస్పరస్ వంటి పోషకాలు తగ్గుతున్నాయి. ఫలితంగా పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది.
భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు మంటలో కాలిపోవడంతో పంటకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటున్నాయి. వరి కొయ్యలను కాల్చడంతో ఒక్కోసారి జీవ రాసులు ప్రాణాలకు హాని జరిగే అవకాశాలు ఉంటాయి.ముఖ్యంగా పొలాల్లో తిరిగే పాములు, ఉడుములు, తొండలు, పశుపక్ష్యాదులు చని పోయే ప్రమాదం ఉంటుంది. తద్వారా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పొలాల గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కాలిపోవడంతో పర్యా వరణం దెబ్బతింటుంది. గాలి, నేల కలుషిత మవుతుంది. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు మరణిస్తాయి. సాంకేతిక టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సమాజంలో కాలానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. ఐతే మండలంలో వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతూ…. కేవలం జీతాల కోసం పని చేస్తున్నారా అన్న సందేహలు రైతుల్లో తలెత్తుతున్నాయి. ఇకనైనా అధికారుల్లో చలనం వచ్చి రైతులకు అవగాహాన చేసి భూసార పరీక్షలపై దృష్టి పెడతారో లేదో చూడాలి.
రైతులు అవగాహన కల్పించాలి
అందే రాజి రెడ్డి రైతు సంఘం నాయకులు
గ్రా. నగరం మం..అక్బర్ పేట భూంపల్లి
వరి కొయ్యలు కాల్చడంపై రైతు సోదరులకు  వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలి.ఈ విషయాన్ని ఏఈఓలు గ్రామ పంచయతీల్లో నూ మరియు క్లస్టర్ పరిధిలో రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాల్లో రైతులకు తెలియజేయాలి.వరి కొయ్యలు కాల్చడం వల్ల రైతులకే ఎంతో నష్టం, దిగు బడి కూడా తగ్గిపోయి రాబోయే కాలంలో భూమి దేనికి పనికిరాకుండా పోతుందనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరించాలి.
భవిష్యత్ పంటలకు దెబ్బ
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు: చల్లా తిరుపతి రెడ్డి
సాగు పంటలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.యాసంగి కోతలు ముగిసి నెలలు గడుస్తున్నాయి. ప్రస్తుతం రైతులంతా ఖరీఫ్ సాగుపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో అవగాహన లేక రైతులంతా వరి కొయ్యలు అంటిస్తున్నారు. ఇలా చేస్తే భూమిలోని లవణాలు శాతం తగ్గి భూమి పనికిరాకుండా పోతుంది. క్రమంగా భూమి సారవంతాన్ని కోల్పోయి…. భవిషత్ లో వేసే పంటలు దెబ్బతిని దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది.రైతులు నష్టపోకుండా అధికారులే అవగాహన, జాగ్రత్తలు కల్పించాలి. రైతుల పొలాల్లో భూసార పరీక్షల చేయించి, వచ్చి రిపోర్ట్ ఆధారంగా ఏయే పంటలు వేయాలో చెప్పాలి.

Spread the love