రైతు బిడ్డలు దేశ సేవ కోసం

– ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు
– సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టిన దళిత కుటుంబానికి చెందిన అన్నాచెల్లెల్లు
నవతెలంగాణ-వీణవంక
పట్టుదలతో ఏదైనా సాధించొచ్చని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన రైతు బిడ్డలు దేశ సేవ చేయాలనే సంకల్పంతో ప్రయత్నం మొదలు పెట్టారు. మొదటి ప్రయత్నంలోనే కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో (దళిత కుటుంబం) ఒకే కుటుంబంలోని చెల్లె సీఆర్పీఎఫ్, అన్న సీఐఎస్ఎఫ్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలైన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఫలితం సాధించాలేదు. కానీ వారు మొదటి ప్రయత్నంలోనే దేశ భద్రత కోసం సాధించిన ఉద్యోగం సాధించడంపై గ్రామస్తలు వారిని అభినందిస్తున్నారు. వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల ప్రభాకర్-రాజమణిల కుమార్తె స్రవంతి నర్సరి నుండి పదో తరగతి వరకు చదవి మోడల్ స్కూల్ లో ఇంటర్ చదివింది. ఆ తర్వాత జమ్మికుంట పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లై చేసి వాటి కోసం కోచింగ్ తీసుకుని ప్రయత్నం చేసి ఇటీవల విడుల చేసిన ఎస్సై ఫలితాల్లో ఉద్యోగం చేయలేకపోయింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం రాసిన పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తోంది. అలాగే దేశ సేవ చేయాలని, దేశ రక్షణ కోసం తాను ముందుకెళ్లాలనే సంకల్పంతో సీఆర్పీఎఫ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడంతో అటు కూడా దరఖాస్తు చేసుకుంది. మొదటి ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి ఔరా అనిపించింది. అలాగే అదే కుటుంబానికి చెందిన స్రవంతి చిన్నాన్న పోతుల చంద్రయ్య-ఇందిరల రెండో కుమారుడు, ఆమె సోదరుడు శ్రావణ్ కూడా పట్టుదలతో ప్రయత్నం మొదలు పెట్టిన తొలిప్రయత్నంలోనే ఆయన కూడా సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. శ్రావణ్ కూడా ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు మండలంలోని ఘన్ముక్ల మోడల్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. శ్రావణ్ సైతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలైన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. దేశరక్షణ, సేవ చేయాలనే లక్ష్యంతో సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ కోసం చేసిన తొలిప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాడు. అన్నాచెల్లెల్లు ఇద్దరూ ఒకరికొకరు పోటీపడుతూ కలిసి రన్నింగ్, లాంగ్ జంప్ తదితర ఈవెంట్స్ పై శిక్షణ తీసుకున్నారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబం నుండి పుట్టిన పిల్లలు మట్టిలో మాణిక్యాలుగా ఎదిగడంపై వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love