ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల ఆందోళన..

నవతెలంగాణ – హైదరాబాద్: ఖమ్మం మార్కెట్లో మిర్చి రైతులు పోరుబాట పట్టారు. వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని అన్నదాతలు ఆందోళనకు దిగారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆయన రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా వారు శాంతించకుండా గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నాకు దిగారు. అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ధర్నాతో మార్కెట్‌లో ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండా పాట ధర క్వింటాల్‌కు రూ.20,800గా ప్రకటించి.. కేవలం రూ.14 వేల నుంచి రూ.16 వేల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యాపారులతో అదనపు కలెక్టర్‌, మార్కెట్‌ శాఖ అధికారులు కొద్దిసేపట్లో చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Spread the love