రెజ్లర్లకు మద్దతుగా రైతుల మహాసభ…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద గత కొన్ని వారాలుగా నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతుగా రైతులు మహాసభ నిర్వహించారు. హర్యానాలోని మెహమ్‌లో వందలాది రైతులు ఆదివారం సమావేశమయ్యారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు నార్కో టెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. కాగా, తమ ఆందోళనను తీవ్రం చేయాలని రైతులు నిర్ణయించారు. దీని కోసం కార్యాచరణను ఖరారు చేశారు. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద క్యాండిల్‌ ర్యాలీ చేపట్టనున్నారు. అలాగే ఈ నెల 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్న పార్లమెంట్‌ కొత్త భవనం వద్ద మహిళా రైతులతో మహా పంచాయతీ నిర్వహిస్తామని రైతులు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై అదే రోజున తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిరసన చేస్తున్న రెజ్లర్లకు ఎప్పుడు, ఎలాంటి సహాయం కావాలన్నా తాము ముందు ఉంటామంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు.

Spread the love