– వర్షాకాలం పంటలకు నీరందిస్తాం
– తుమ్మిడిహట్టి నిర్మించి తీరుతాం
– ఎన్డీఎస్ నివేదిక ఆధారంగా యుద్ధ ప్రాతిపదికన డ్యామ్‌కు మరమ్మతులు
– జ్యుడీషియల్ ఎంక్వయిరీ తర్వాత దోషులకు శిక్ష తప్పదు :భారీ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ- భూపాలపల్లి/మంథని
రైతులు అధైర్య పడొదు.. ఈ వానాకాలం సీజన్‌కు సాగునీళ్లిస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నాసిరకంగా నిర్మించడం వల్లే మేడిగడ్డ కుంగిందన్నారు. ప్రాజెక్టు రిపేర్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద మరమ్మతు పనులు చేపట్టినట్టు చెప్పారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం, మేడిగడ్డ లకీëబ్యారేజ్, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల(పార్వతి) బ్యారేజీని మంత్రి సందర్శించారు. మరమ్మతు పనులను పరిశీలించి.. ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డలోని ఎల్ఎంటీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ప్రాజెక్టు మరమ్మతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తాము అధికారంలోకి రాగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు రక్షణ కోసం 3 ఏజెన్సీలకు పనులు అప్పగించినట్టు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలను తెలుసుకునేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్ బ్యారేజీ సందర్శనకు వస్తుందన్నారు. తమ మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా తమ్మిడిహెట్టి ప్రాజెక్టు తప్పనిసరిగా నిర్మిస్తామన్నారు. వర్షాకాలం లోపు మరమ్మతులు వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్నారం ప్రాజెక్ట్‌లో 60శాతం, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లో 80 శాతం పనులు పూర్తి కావొచ్చాయన్నారు. సుందిళ్లలో మాత్రం పనులు నత్తనడకన సాగుతుండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి గత ప్రభుత్వం రూ.94 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాల ఆయకట్టు మాత్రమే తయారైందని, అది కూడా ఇప్పుడు కుంగుబాటుకు గురైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మూడు బ్యారేజీలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన 94 వేల కోట్ల రూపాయలకు వడ్డీ కడుతున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను ఎల్‌అండ్‌టి, అన్నారం ఆఫ్రాన్ కన్స్ట్రక్షన్స్, సుందిళ్ల బ్యారేజీని నవయుగ కంపెనీలతో తాత్కాలిక మరమ్మతులు చేపిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జ్యుడీషియల్ విచారణ నడుస్తోందని తెలిపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దోషులకు శిక్ష తప్పదని అన్నారు. గత ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డికి రూ.23,500 కోట్లు ఖర్చు పెట్టి ఎకరం ఆయకట్టు ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టుకు రూ.7000కోట్లు ఖర్చుపెట్టినా ఎకరం ఆయకట్టు ఇవ్వలేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తుమ్మిడిహట్టి దగ్గర రూ.38వేల కోట్లతో 16లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు డిపిఆర్ సిద్ధం చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే దీని కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు వస్తోందని ఎద్దేవా చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు సాగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
సుందిళ్ల మరమ్మతులపై అసంతృప్తి
సుందిళ్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనుల్లో ఆలస్యంపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను, గుత్తేదారు ఏజెన్సీలను ఆదేశించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన సూచనల ప్రకారం మరమ్మతులు, పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిలో ఆశించిన మేర ఫలితం కనపడటం లేదని, అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఏ పని ఎప్పటి వరకు పూర్తవుతుందో కాగితంపై షెడ్యూల్ రూపొందించి అందించాలన్నారు. బ్యారేజ్ సమీపంలో గల పంప్‌హౌస్ సంరక్షణ కోసం నిర్మిస్తున్న కట్ట వల్ల స్థానికులకు కలిగే నష్టాన్ని స్థానిక మంత్రితో కలిసి అంచనా వేసి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారిని ఆదేశించారు.
మంత్రి వెంట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే, నీటిపారుదల శాఖ ఈఎస్సీ జనరల్ జి.అనిల్ కుమార్, ఇంజినీర్లు, ఎల్అండ్టీ, అస్కాన్, నవయుగ సంస్థల ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
జాతీయ హోదా ఇవ్వలేదు..
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హౌదా ఇవ్వలేదని గత ప్రభుత్వ నాయకులు తెలిపారని, తాము అధికారంలోకొచ్చిన తర్వాత కేంద్ర జల వనరులశాఖ మంత్రిని కలిస్తే అసలు జాతీయ హౌదా కోసం వారు దరఖాస్తు చేసుకోలేదని తెలిపారన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరితే 60శాతం నిధులు కేంద్రం నుంచి కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గతంలోనే డిజైన్ చేసిన డీపీఆర్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని తాము మ్యానిఫెస్టోలో కూడా ప్రకటించినట్టు గుర్తు చేశారు.
ఎల్‌అండ్‌టి ఇంజినీరింగ్ చీఫ్ మాట్లాడుతూ.. ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల మేరకు జీఆర్పీ టెస్ట్, ఈఆర్పి టెస్ట్, స్కైండ్ ఫైల్స్, ఇంటిగ్రెటిసిటీ చేయమన్నారని, గేట్లు ఎత్తి ఉంచాలని తెలిపారన్నారు. వరదలు వస్తే 5మీటర్ల ఎత్తులో జియో ట్యూబ్‌లు ఏర్పాటు చేస్తే నీటిని ఎత్తిపోయొచ్చన్నారు. అన్నారంలో 11మీటర్లు నీటిని ఆపితే ఎత్తిపోయొచ్చని, సుందిళ్లలో 9 మీటర్లు ఆపితే ఎత్తిపోయొచ్చని అన్నారు.