రైతుల ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి..

– గుండు రామస్వామి తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతుల ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా నాయకులు గుండు రామస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో రామస్వామి మాట్లాడారు. రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి 30 రోజుల నుండి 45 రోజులు వ్యవధి కావస్తున్న రైతుల ఖాతాల్లో దాన్యం డబ్బులు జమ కాకపోవడం తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం అధికారుల తమ వైఖరి మార్చుకోవాలని అన్నారు. ములుగు జిల్లాలో లక్షల క్వింటాళ్ల ధాన్యం పండితే కేవలం ఐదు మిల్లులకే తోలకం పరిమితం చేయడం వల్ల కాంట వేసిన ధాన్యాన్ని తరలించేందుకు 20 నుండి 30 రోజులు రైతులకు పట్టిందన్నారు. ఓ పక్క అకాల వర్షాలు కళ్ళ ఎదుటే తడిసిపోతున్న ధాన్యం కాంట వేసిన తరలించలేని వైనం వెరసి రైతులను పరిస్థితులు విపరీతంగా కొంగదీశాయని అన్నారు. అప్పటినుండి మరో నెల రోజులు దాటిన డబ్బులు జమ కాకపోవడంతో కూలీలకు వరి కోసిన యంత్రాల వారికి ట్రాక్టర్ యజమాన్యానికి సమాధాన చెప్పుకొలేక రైతులు నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. ఇదే అదనుగా లారీ యాజమాన్యం దిగుమతి సక్రమంగా జరగడం లేదని రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రతి 40 కిలోల ధాన్యం బస్తాకు రైతు పది రూపాయలు చెల్లించినట్లయితేనే లోడ్ వేసుకుంటామని దోపిడీ చేస్తున్నారని అన్నారు. మరోపక్క మిల్లు యాజమాన్యం క్వింటాకు 10 కిలోల కాడికి కోతవీధిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం మిల్లు యాజమాన్యం లారీ అసోసియేషన్ చివరకు హమాలీ వాళ్లు కూడా రైతాంగాన్ని ఆగం పట్టిస్తున్నారని అన్నారు. వ్యవసాయం పండగ అని ప్రభుత్వం అంటే దండగ అని రైతు అనే పరిస్థితులు సృష్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతినిధులు మంత్రులు అధికారులు స్పందించి సకాలంలో ధాన్యం డబ్బులు ఖాతాలు జమ ఏ విధంగా చర్యలు చేపట్టాలని లేనియెడల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు నిమ్మల బిక్షం, దేవి పాల్, కూన వెంకన్న, గుండు లెనిన్, రాజ్ కుమార్ ల తోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Spread the love