వానాకాలం నుంచే కౌలురైతులకు రైతుభరోసా ఇవ్వాలి

వానాకాలం నుంచే కౌలురైతులకు రైతుభరోసా ఇవ్వాలి– ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి
– ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి
– ఉద్యోగుల బిల్లులు మంజూరు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని కౌలురైతులకు ఈ వానాకాలం నుంచే రైతుభరోసాను అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో టి జ్యోతి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్‌, బివి రాఘవులు పాల్గొని పార్లమెంట్‌ ఎన్నికలు, దేశ రాజకీయ పరిణామాలను వివరించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించి విడుదల చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా కౌలు రైతులు 30 శాతానికి పైగా వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. రైతుల ఆత్మహత్యల్లో సగం మంది వారేనని తెలిపారు. గత రెండేండ్లుగా రాష్ట్రంలో పంటల బీమా సౌకర్యం లేదని పేర్కొన్నారు. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించేలా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.రెండు లక్షల వరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ వెంటనే అమలుచేయగలిగితే వానాకాలం సాగు పెట్టుబడికి రైతులకు ఉపయోగముంటుందని సూచించారు. లేదంటే రైతులు ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, గ్రాట్యూటీ, ప్రభుత్వ జీవిత బీమా, జీపీఎఫ్‌, సరెండర్‌ లీవ్స్‌, కమ్యూటేషన్‌ వంటి బిల్లులు దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్నాయని వివరించారు. గ్రామపంచాయతీ కార్మికులకు ఆరు నుంచి తొమ్మిది నెలల వేతనం, మున్సిపల్‌ కార్మికులకు మూడునెలల వేతనం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఐదు నెలల బకాయిలు, వైద్య రంగంలో 104 ఉద్యోగులకు ఎనిమిది నెలల జీతాలు బకాయిలున్నాయని తెలిపారు. షెడ్యూల్డ్‌ ఎంప్లాయీస్‌ పరిశ్రమల్లో పని చేసే కార్మికుల వేతనాల సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే వేతనాలను చెల్లించి, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కనీస వేతనాల డ్రాఫ్ట్‌ జారీలో జరిగిన లోపాలను సరిదిద్ది, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love