– పెద్దకొడప్‌గల్ తహసీల్దార్ కార్యాలయంలో ఘటన
– రూ.20 వేలు తీసుకున్నా పాస్‌పుస్తకం ఇవ్వడం లేదని ఆరోపణ
నవతెలంగాణ-పెద్దకొడప్‌గల్
పట్టాపాస్ పుస్తకం ఇవ్వడం లేదంటూ ఓ రైతు ప్రజావాణిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి బాధితుడి వివరాల ప్రకారం.. వడ్లం గ్రామానికి చెందిన రైతు అంజయ్య భూమి పట్టా పాస్‌పుస్తకం కోసం కొన్ని నెలల కిందట దరఖాస్తు చేసుకున్నాడు. కాగా, ఆర్‌ఐ పండరి రూ.20 వేల లంచం అడిగితే నగదు ఇచ్చాడు. అయినప్పటికీ ఆర్‌ఐ పండరి పాసుపుస్తకం ఇవ్వకుండా.. రేపు మాపంటూ కాలయాపన చేస్తూ రైతును ఇబ్బందులకు గురిచేశాడు. దాంతో మనస్తాపం చెందిన రైతు అంజయ్య తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణికి వచ్చి అక్కడే పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు అతన్ని పెద్దకొడప్‌గల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చిిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై తహసీల్దార్ దశరథ్ స్పందిస్తూ.. రైతు అంజయ్య భూమి పార్ట్-బిలో ఉందని, దానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఏమీ చేయలేమని తెలిపారు. ఆర్‌ఐ పండరి రైతు వద్ద రూ.20వేలు తీసుకున్నట్టు తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు.