– కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేసింది : రైతు ఆత్మహత్యల అధ్యయన వేదిక కమిటీ చైర్మెన్ నిరంజన్‌రెడ్డి
– బేల మండలంలో రైతు కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ- బేల, ఆదిలాబాద్ రూరల్
రైతులకు బూటకపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు ఆత్మహత్యల అధ్యయన వేదిక కమిటీ చైర్మెన్, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రుణమాఫీ, రైతుభరోసా అమలు చేయకపోవడంతో రైతులు అప్పుల భారంతో ప్రాణం తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్నదాతల స్థితిగతులు, ప్రభుత్వ విధానాలు తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్ వేసిన అధ్యయన కమిటీ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించింది. ఇటీవల ఓ బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బేల మండలం రేణిగూడకు జాదవ్ దేవురావు కుటుంబ సభ్యులను కమిటీ సభ్యులు మాజీ మంత్రులు జోగు రామన్న, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజరు, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, యాదవ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్‌తో కలిసి పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకొని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి జోగు రామన్న రూ.లక్ష సాయాన్ని అందించారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయిలో పంట పొలాలను పరిశీలించారు. రైతులను పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాపల్‌గూడలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అన్నదాతలు తాము ఎదుర్కుంటున్న సమస్యలను కమిటీకి తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటి చైర్మెన్ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమాలతో సాధిం చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని గత బీఆర్ ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిందని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సైతం ప్రభుత్వానికి చేతకావడం లేదని, రైతులు పిట్టల్లా రాలిపోతున్న స్పందన లేదని అన్నారు.