– మహారాష్ట్రలోని పాలగఢ్ కలెక్టరేట్ ముట్టడి
– వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు,మహిళా రైతులు
ముంబయి : మహారాష్ట్రలో అన్నదాతల ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నేతృత్వంలో పాలగఢ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని గత మే 30న ముట్టడించారు. ఈ ఆందోళన కార్యాక్రమంలో దాదాపు 25 వేల మంది పైగా అన్నదాతలు తరలివచ్చారు. వీరిలో అత్యధిక మంది గిరిజనులు, మహిళా రైతులు, వ్యవసాయ కార్మికులు భాగస్వామ్యం కావడం విశేషం. ఉప్పెనలా పోటెత్తిన రైతులు, గిరిజనులు కలెక్టరేట్‌ను దిగ్బంధించినంత పని చేశారు. అంతకుముందు కలెక్టరేట్ వరకూ భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌కు ఏఐకేఎస్ నాయకుల బృందం వినతిపత్రం సమర్పించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు ప్రధాన డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇచ్చింది. ఇవీ ప్రధాన డిమాండ్లు : అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఎ) కింద భూముల కోసం దాదాపు 61 వేల మంది పైగా క్లయిమ్ చేసుకున్నారని, వారందరి ప్రస్తుత స్థితి ఎఐకెఎస్‌తో పంచుకోవాలి. కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా భూహక్కుల కోసం మంగళవారం నాడు సమర్పించిన వేలాది దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్ కార్యాలయాలకు పంపి సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గిరిజనులు సాగు చేసుకున్న భూముల్లో పంట చేతికొస్తుందని, ఆ భూమలన్నింటిపైనా ఆదివాసీలకు హక్కులు కల్పించాలి. 1940లలో ఎఐకెఎస్ నేతృత్వంలో సాగిన ఆదివాసీ మహోద్యమం సమయంలో వందలాది మంది భూస్వాములను పంట పొలాల నుంచి తరిమికట్టే స్వాధీనం చేసుకున్నారని ఎఐకెఎస్ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధావలే, రాష్ట్ర అధ్యక్షులు ఉమేశ్ దేశ్‌ముఖ్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అజిత్ నవాలే, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిసన్ గుజార్, ఐద్వా జాతీయ ప్రధానకార్యదర్శి మరియం ధావలే, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వినోద్ నికోల్ ,స్థానిక ఎమ్మెల్యే ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు చంద్రకాంత్ గోర్ఖానాతో సహా పలువురు విదార్థి, యువజన సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.