– గత 38 రోజులుగా మందకొండిగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు…
– ఇప్పటివరకు కొనుగోలు చేసింది 1,75,000 టన్నులు మాత్రమే….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏప్రిల్ ఒకటవ తేదీన జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత, వాహనాల కొరత తో వారం పది రోజులు లేటుగా కొనుగోలు ప్రారంభించారు. కొనుగోలు ప్రారంభించి నెల మీద వారం గడుస్తున్నప్పటికీ , ఇప్పటివరకు కనీసం సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు.
జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వివరాలు ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు, 421 గ్రామపంచాయతీలలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 323 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో ఐకెపి కొనుగోలు కేంద్రాలు 85, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలు 225, రైతు ఉత్పత్తి సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలు 13 చొప్పున ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సుమారు 250కి పైగా వాహనాలను సమకూర్చారు. రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరతతో ఒక లారీ అన్లోడ్ కావడానికి కనీసం రెండు మూడు రోజులు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ధాన్యం దిగుబడి ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి సీజన్లో 2 లక్షల 93 వేల ఎకరాల విస్తీర్ణంలో వారిని సాగు చేశారు. దిగుబడి ఐదు లక్షల 25వేల మెట్రిక్ టన్నులు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయగా, నాలుగు లక్షల వరకు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాల అలసత్వంతో అధికారులు మూడు లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 1వ తేదీన కొనుగోలు కేంద్రాల ప్రారంభం..
ఏప్రిల్ ఒకటవ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ వారం పది రోజులైనా కూడా కొనుగోలు ప్రారంభం కాకపోవడం , హమాలీల కొరత, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత మిల్లులకు కేటాయించకపోవడం, వాహనాల కొరతతో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కొనుగోలు ప్రారంభించి సుమారు 38 రోజులు కావల్సినప్పటికి, ఇప్పటివరకు కేవలం 1,75,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా సగం ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. అకాల వర్షాలతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టలేక, మార్కెట్లో పోసిన ధాన్యాన్ని ప్రైవేటుకు అమ్మలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు..
కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు రెండు మూడు రోజులు గడుస్తూ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నుంచి లారీకి 1000 నుంచి 2000 రూపాయలు వసూలు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. భువనగిరి మండలం బోల్లపల్లి నందరం ఐకెపి కొనుగోలు కేంద్రాలలో ఇటీవల ఇబ్బందులు తరతర సమస్యలను అధికారులు పరిష్కరించారు. ఆలేరులో దానం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌరసరపారుల శాఖ డిఎస్ చౌహన్ సందర్శించి, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలలో పూర్తిస్థాయిలో వసతులు కల్పించడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. ఇటీవల మోత్కూరు, గుండాల, మండలంలో వర్షాలు కురువగా, మంగళవారం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయింది.