రుణమాఫీ కోసం రైతుల రాస్తారోకో

Farmers write for loan waiver–  రెన్యువల్‌ చేసుకోవడమే
– మేము చేసినా తప్పా అని ఆవేదన
నవతెలంగాణ- మునుగోడు
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని జీవో విడుదల చేసి నెల రోజులు గడుస్తున్నా ఖాతాల్లో జమ కాలేదంటూ రైతులు రాస్తారోకో చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో మునుగోడు నుంచి చౌటుప్పల్‌కి వెళ్లే ప్రధాన రహదారిపై కొంపెల్లి కెనరా బ్యాంక్‌ ఎదుట రైతులు, ప్రజాప్రతినిధులు సోమవారం రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా కొంపల్లి సర్పంచ్‌ జాల వెంకన్న యాదవ్‌, వెల్మకన్న ఎంపీటీసీ చాపల మారయ్య, కల్వకుంట్ల సర్పంచ్‌ పగిళ్ల బిక్షం మాట్లాడారు. కెనరా బ్యాంక్‌లో క్రాప్‌ లోను తీసుకుని ప్రతి ఏడాదీ రెన్యువల్‌ చేసుకున్న రైతులకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రుణమాఫీ కాలేదన్నారు. 2018లో రుణం తీసుకుని ఇప్పటి వరకు బ్యాంకు ముఖం చూడని వారికి రుణమాఫీ అయిందని, రెన్యువల్‌ చేసుకున్న రైతులకు మాఫీ కాక తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి లోను రెన్యువల్‌ చేసుకున్న రైతుల ఖాతాల్లోనూ లక్ష రూపాయల రుణమాఫీని జమ చేయాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో కెనరా బ్యాంక్‌ ఏజీఎంతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మక్కెన అప్పారావు, మాజీ సర్పంచులు జీడిమెట్ల నరసింహ, బోయపర్తి లింగయ్య, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎడ్ల రామలింగయ్య, వీరమల్ల వెంకట్రావు, జీడిమెట్ల పిచ్చయ్య పాల్గొన్నారు.

Spread the love