ధాన్యం డబ్బులు చెల్లించాలని రైతుల రాస్తారోకో

నవతెలంగాణ – మల్లాపూర్‌
వరి ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాలో జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని కొత్త దామరాజుపల్లి గ్రామంలో గురువారం రైతులు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. వరి ధాన్యం అమ్మి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వడం లేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో వానాకాలంలో విత్తనాలు తెచ్చేందుకు, పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా డబ్బులు ఖాతాలో జమ కాలేదన్నారు. సుమారు గంటపాటు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ రవీందర్‌, ఎస్‌ఐ నవీన్‌ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైతులు గజ్జి శ్రీనివాస్‌, పన్నాల నారాయణ, కాటిపెళ్లి రాజశేఖర్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love