నవతెలంగాణ హైదరాబాద్: మెట్రో రైలు రెండో దశ (Phase-2) విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆమోదం తెలిపినట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ 70 కిలోమీటర్ల మేర రెండో దశలో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీనికి సంబంధించిన ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ శరవేగంగా జరుగుతున్నట్టు మెట్రో ఎండీ చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ మెట్రో రైలు ప్రగతిని సంస్థ ఎండీ వివరించారు. ఫేజ్-2లో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాలకు అందుతాయని వెల్లడించారు. సంస్థ ఇంజినీర్లు, ఉద్యోగులు తమను తాము పునరంకితం చేసుకోవాలని, వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు.