ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం…

నవతెలంగాణ – హైదరాబాద్
రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో ఎగిరి అదే కారు అద్దంపై పడ్డాడు. ఈ క్రమంలో ఆయన తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. ఈ హృదయ విదారక సంఘటన ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధి తొండుపల్లి సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్య(65) రోజువారీ కూలీ. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. రాత్రి దారి తప్పి ఔటర్‌ మీదుగా తుక్కుగూడ వైపు నడుచుకుంటూ బయల్దేరారు. తొండుపల్లి కూడలి వద్ద ఔటర్‌ ప్రధాన రహదారిని దాటుతుండగా గచ్చిబౌలి నుంచి వేగంగా వచ్చిన కారు ఆయన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజయ్య తల నేరుగా కారు అద్దాన్ని తాకింది. దీంతో అద్దం పగిలి తల అందులో ఇరుక్కుపోయింది. అయితే వాహనం వేగంగా వెళ్తుండటంతో మెడ కోసుకుపోయి తల లోపల సీట్లో, మొండెం రోడ్డుపై పడ్డాయి. ఔటర్‌ పెట్రోలింగ్‌ గస్తీ బృందం, శంషాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.

Spread the love