మీడియాపై అవినాష్‌రెడ్డి అనుచరుల దాడికి ఫెడరేషన్‌ ఖండన

నవతెలంగాణ-హైదారాబాద్‌
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, హెచ్‌ఎంటీవి రిపోర్టర్లు, ఇతర సిబ్బందిపై శుక్రవారం మాసాబ్‌ ట్యాంక్‌ సమీపంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అనుచరులు దాడికి పాల్పడి, వాహనాలు, కెమేరాలు ధ్వంసం చేయడాన్ని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవ పున్నయ్య శుక్రవారం ఒక ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా ఛానెళ్ల ప్రసారాల పట్ల, వ్యక్తుల ప్రవర్తన పట్ల ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్‌ కౌన్సిల్‌ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ, భౌతికదాడులకు పాల్పడటం సరికాదని వ్యాఖ్యానించింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పై దాడులకు పాల్పడటం ద్వారా బెదిరించాలనుకోవడం, మీడియాను నియంత్రించాలనుకోవడం భ్రమేనని అభిప్రాయపడ్డారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వార్తలను స్వేచ్ఛగా అందించే హక్కు, బాధ్యత మీడియాకు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. తన అనుచరులకు ఎంపీ అవినాష్‌రెడ్డి బుద్ధిచెప్పుకోవాలనీ, ఎవరూ రాజ్యాంగానికి, చట్టానికి అతీతులు కారని చెప్పారు. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి చట్టపరమైన కేసులు నమోదు చేసి, అరెస్ట్‌ చేయాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ ఈ విషయమై దృష్టిసారించి గట్టిచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love