22న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష

– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్‌
నవతెలంగాణ-కరీంనగర్‌: ఈ నెల 22న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగే ఫీజు దీక్షను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్‌ అన్నారు. స్థానిక భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్‌ మాట్లాడుతూ..ఈనెల 22న కలెక్టరేట్‌ ఎదుట జరిగే ఫీజు దీక్షను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. పెండింగ్‌ స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫీజు దీక్ష రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో 5,177 కోట్లు విడుదల చేయకుండా కాలక్షేపం చేస్తూ సమయాన్ని గడుపుతుందని అన్నారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల పేరుతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే విద్యార్థులకు ఉపయోగపడేలా విద్యలో మంచి స్థానం ఉండే విధంగా ఉంటుందనుకుంటే కనీసం స్కాలర్‌షిప్‌ విడుదల చేయకుండా విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఈ ఫీజు దీక్షలో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 22న నిర్వహించే ఒక రోజు దీక్షలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి అసంపల్లి వినరు సాగర్‌, నాయకులు రాకేష్‌, నవనీత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love