డ్రయినేజీలో పడి మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

–  మంత్రి కేటీఆర్‌ బందోబస్తులో ఘటన
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
విధుల్లో ఉన్న మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ ప్రమాదవశాత్తు డ్రయినేజీ కాలువలో పడి మృతిచెందారు. ఈ ఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రాచలంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం కొత్తగూడెం వన్‌ టౌన్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీదేవి భద్రాచలం వచ్చారు. అయితే, భారీ వర్షం వల్ల రోడ్లంతా నీటితో నిండి డ్రయినేజీ కూడా కనిపించకుండా పారుతోంది. ఆ సమయంలో రామాలయం వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసే స్థలం వద్ద నుంచి అన్నదాన సత్రం వైపు శ్రీదేవి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవ శాత్తు మురుగు కాలువలో పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, పొలీస్‌, రెవెన్యూ, పంచాయతీ శాఖల సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా శ్రీదేవి మృతదేహం కరకట్ట వద్ద స్లూయిజ్‌లో లభ్యమయింది. దీంతో పోలీస్‌ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీదేవి మృతదేహాన్ని చూసి తోటి మహిళా ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై ఏఎస్‌పి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మృతహాన్ని ఎంపీ మాలోత్‌ కవిత, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సందర్శించి నివాళి అర్పించారు.

Spread the love