విద్యార్థుల ఎదుటే తన్నుకున్న మహిళా టీచర్లు…

నవతెలంగాణ – పట్నా
ఓ పాఠశాల మహిళా ప్రిన్సిపాల్, టీచర్ సివంగుల్లా తలపడ్డారు. ఇద్దరూ కలబడి కిందపడి కొట్టుకున్నారు. చెప్పులకు కూడా పనిచెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. బీహార్‌లోని పాట్నా జిల్లా కౌరియా పంచాయతీలోని బిహ్తా మిడిల్ స్కూల్‌లో జరిగిందీ ఘటన.  టీచర్, ప్రిన్సిపాల్ తలపడుతుంటే విద్యార్థులందరూ చుట్టూ చేరి వినోదం చూశారు. మరికొందరు ఆ ఘటనను సెల్‌ఫోన్లలో బంధించారు. కిటికీ తలుపులు మూయడంపై ప్రధానోపాధ్యాయురాలు, టీచర్ల మధ్య ఘర్షణ మొదలైంది. క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్‌కు చెప్పారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రిన్సిపల్‌ కాంతి కుమారి క్లాస్‌రూమ్‌ నుంచి బయటకు వస్తుండగా.. టీచర్‌ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు. అనితకు మద్దతుగా మరో టీచర్‌ కూడా ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురు కొట్టుకున్నారు. ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరిగింది. అనంతరం పొలాల్లో పనిచేసే కొందరు వీరిని వారించడంతో గొడవను ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు స్థానిక మీడియా ప్రతినిధులు సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి నరేశ్‌ స్పందించారు. ప్రధానోపాధ్యాయురాలితో ఆ ఇద్దరు టీచర్లకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.