– 13మంది మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
ముంబయి : ముంబయి తీరంలో బుధవారం జరిగిన ప్రమాదంలో 13మంది మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. ఇంజన్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత నావికాదళానికి చెందిన స్పీడ్ బోట్ పట్టు తప్పి ప్రయాణికుల ఫెర్రీని ఢ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నావికాదళ అధికారి ఒకరు, ఒరిజినల్ పరికరాల తయారీదారు కంపెనీకి చెందిన ఇద్దరు వున్నారని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాద సమయంలో ఫెర్రీలో 110 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 94మందిని కాపాడారు. ప్రమాదం జరిగినప్పటి వీడియో ఒకటి బయటికి వచ్చింది. అంతకుముందు ఫెర్రీ మునిగిపోతోందని మాత్రమే వార్తలు వచ్చాయి. కారణం తెలియరాలేదు. గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా ఐల్యాండ్ వరకు ఈ స్పీడ్ బోటు వెళుతోంది. లైఫ్ జాకెట్లు వేసుకున్న వారినందరినీ కాపాడి వేరే బోటులోకి పంపించడం వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు ఫెర్రీ నెమ్మదిగా నీళ్ళలోకి ఒరిగిపోవడం కూడా కనిపిస్తోంది.
సహాయక చర్యల్లో భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ దళాలు పాల్గొన్నాయి. 11 నేవీ బోట్లు, మెరైన్ పోలీసులకుచెందిన మూడు బోట్లు, కోస్ట్ గార్డ్ దళాలకు చెందిన మరో బోటు రంగంలోకి దిగాయని రక్షణ అధికారి తెలిపారు. సహాయక చర్యల్లో నాలుగు హెలికాప్టర్లు పాల్గొనగా, ఆ ప్రాంతంలోని జాలర్లు, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వర్కర్లు, పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.